BJP: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారి... బయటకు పంపిన కమలనాథులు
![bjp leeaders fires on ts intelligence officer in party national executive council meeting](https://imgd.ap7am.com/thumbnail/cr-20220703tn62c13e6469e3d.jpg)
- సమావేశాలను వీడియో తీసిన ఇంటెలిజెన్స్ అధికారి
- గమనించి నిలదీసిన బీజేపీ నేతలు
- తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారిగా ఒప్పుకున్న వైనం
హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం నాటి సమావేశాలు ప్రారంభం అయిన కాసేపటికే అక్కడ కలకలం రేగింది. ఈ సమావేశాల్లోకి ప్రవేశించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు సమావేశాలను వీడియో తీస్తూ కనిపించారు. ఈ విషయాన్ని గమనించిన బీజేపీ నేతలు సదరు అధికారిని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా తాను తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారినని ఆయన చెప్పగా... కమలనాథులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయనను సమావేశాల నుంచి బయటకు పంపేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తన పరిధిలో జరిగే ఆయా కార్యక్రమాల సమాచారాన్ని సేకరిస్తుంది. ఇందుకోసం ఇంటెలిజెన్స్ అధికారులను వినియోగిస్తుంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాల సేకరణకు కూడా తెలంగాణ సర్కారు తన ఇంటెలిజెన్స్ అధికారిని పంపడం గమనార్హం.