BJP: ఉదయ్ పూర్ టైలర్ హంతకులతో మాకు సంబంధాలు లేవు: కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ స్పందన
- టైలర్ కన్హయ్యలాల్ దారుణహత్య
- నిందితులు రియాజ్, గౌస్ అరెస్ట్
- బీజేపీ నేతలతో కలిసున్న ఫొటోలు పంచుకున్న కాంగ్రెస్
- నేతలతో ఎవరైనా ఫొటోలు దిగొచ్చన్న బీజేపీ
ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ను రియాజ్ అట్టారీ, గౌస్ మహ్మద్ అనే వ్యక్తులు అత్యంత దారుణంగా వధించడం తెలిసిందే. నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్టును షేర్ చేశాడంటూ వారు కన్హయ్యలాల్ ను హత్య చేశారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే, రియాజ్ అట్టారీ, గౌస్ మహ్మద్ లకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ మేరకు వారు బీజేపీ నేతలతో కలిసి ఉన్న ఫొటోలను బయటపెట్టింది.
దీనిపై బీజేపీ రాజస్థాన్ విభాగం స్పందించింది. ఆ నిందితులిద్దరితో తమకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. రాజకీయ నేతలతో ఎవరైనా ఫొటోలు దిగొచ్చని, అంతమాత్రాన వారు బీజేపీలో సభ్యులైపోతారా? అంటూ రాజస్థాన్ బీజేపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు సాదిక్ ఖాన్ ప్రశ్నించారు. కాగా, ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా టైలర్ కన్హయ్యలాల్ హత్యపై స్పందిస్తూ, నిందితుడు రియాజ్ అట్టారీ బీజేపీ కార్యకర్త అని ఆరోపించారు.