Eknath Shinde: మాకు 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు... ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది: 'మహా' సీఎం ఏక్ నాథ్ షిండే
- మహారాష్ట్ర సీఎంగా అనూహ్య రీతిలో పీఠం ఎక్కిన షిండే
- అసెంబ్లీలో తమ మెజారిటీకి ఇబ్బందిలేదని ఉద్ఘాటన
- గోవా నుంచి మిగిలిన ఎమ్మెల్యేలు రేపు వస్తారని వెల్లడి
- అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళతామని వివరణ
గోవా నుంచి ముంబయిలో అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే సీఎం పదవి దక్కించుకుని, అదే రోజు సాయంత్రానికల్లా ప్రమాణస్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండే దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తాజాగా తమ బలంపై షిండే స్పందించారు. గోవాలో ఉన్న మిగిలున్న ఎమ్మెల్యేలు రేపటికల్లా ముంబయి చేరుకుంటారని వెల్లడించారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, త్వరలోనే ఆ సంఖ్య మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమ మెజారిటీకి ఎలాంటి ఇబ్బందిలేదని స్పష్టం చేశారు.
నిన్న ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక, ఏక్ నాథ్ షిండే పొద్దుపోయాక గోవాలో తన వర్గం ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ కు చేరుకున్నారు. ఆయనకు గోవా సీఎం ప్రమోద్ సావంత్, రెబెల్ ఎమ్మెల్యేలు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గోవాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, "నేను ముంబయి వెళుతున్నాను. నగరంలో వర్షం పరిస్థితులపై ముంబయి కార్పొరేషన్ కమిషనర్ తో మాట్లాడాను. రాష్ట్రంలోని రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళతాం" అని వివరించారు.