Mamata Banerjee: బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాల కోసమే అగ్ని పథ్: మమతా బెనర్జీ
- అందులోంచి బయటికొచ్చినవారికి ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్రం కోరుతోందన్న మమత
- తాము రాష్ట్ర యువతకే ప్రాధాన్యత ఇచ్చుకుంటామని వెల్లడి
- హిందూ టైలర్ ను కొందరు నరికి చంపడాన్ని ఖండిస్తున్నామన్న సీఎం
అగ్నిపథ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకునేందుకే అగ్నిపథ్ పథకాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు.
‘‘అగ్ని పథ్ నుంచి నాలుగేళ్ల తర్వాత బయటికి వచ్చిన అగ్ని వీర్ లకు ఉద్యోగాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నాకు ఒక లేఖ అందింది. బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. మనం ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర యువతకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం..” అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
హింస ఎప్పుడూ సరికాదు
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఓ హిందూ టైలర్ ను కొందరు నరికి చంపడాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ‘‘హింస, ఉన్మాదం ఎప్పటికీ ఆమోదనీయం కాదు. అది ఏదైనా సరే. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టపరంగా వారికి తగిన శిక్ష పడుతుందని భావిస్తున్నాం. అంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా” అని మమత ట్వీట్ చేశారు.