Tollywood: సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడంతో పెద్ద హీరోలకు తీరని నష్టం: నిర్మాత బన్నీ వాసు
- 50 రోజుల దాకా కొత్త సినిమాలు ఓటీటీల్లోకి రావొద్దన్న బన్నీ వాసు
- ఈ దిశగా ఓ నిర్మాతతో అగ్ర హీరో ఒకరు ఒప్పందం చేసుకున్నారని వెల్లడి
- ఈ వ్యవహారంపై బుధవారం నిర్మాతల మండలి కీలక భేటీ అని ప్రకటన
సినిమాలు ఓటీటీల్లో విడుదలకు సంబంధించి టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్లలో విడుదలైన రోజుల వ్యవధిలోనే సినిమాలు ఓటీటీల్లోకి వస్తుండటంతో పెద్ద హీరోలకు తీరని నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ విధానం ఫలితంగా పెద్ద హీరోల క్రేజ్ కూడా తగ్గే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాక...50 రోజుల తర్వాతే ఆయా సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉందని చెప్పిన ఆయన... ఈ దిశగా బుధవారం నిర్మాతల మండలి ఓ కీలక భేటీని నిర్వహించనుందని చెప్పారు.
టాలీవుడ్ హీరో గోపిచంద్ తాజా చిత్రం పక్కా కమర్షియల్ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త సినిమాలు విడుదలయ్యాక 50 రోజుల వరకు ఓటీటీల్లో రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ దిశగా ఓ నిర్మాతతో అగ్ర హీరో ఒకరు ఒప్పందం కూడా చేసుకున్నారని బన్నీ వాసు వెల్లడించారు.