Dog: అంద వికారానికి అవార్డు వచ్చిన మిస్టర్ హ్యాపీ ఫేస్..
- అమెరికాలోని అరిజోనాకు చెందిన మహిళ పెంచుకుంటున్న శునకం
- అంత: సౌందర్యానికి వచ్చిన గుర్తింపు అని భావిస్తున్నట్టు చెప్పిన యజమాని
వంకర ముఖం.. నోట్లో పళ్లు కూడా సరిగా లేవు. ఒక్కసారిగా చూస్తే హైనానో, మరో జంతువో అన్నట్టు కనిపిస్తుంది.. నాలుక బయటపెట్టి నవ్వుతున్నట్టుగా ఉంటుంది. దానిపేరు మిస్టర్ హ్యాపీ ఫేస్. ఇటీవలే అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన వరల్డ్ అగ్లీయెస్ట్ డాగ్ పోటీల్లో టాప్ లో నిలిచి అవార్డు అందుకుంది. దీని వయసు 17 ఏళ్లు. దాని అనారోగ్యం కారణంగా వింతగా అదోరకంగా గురకపెడుతుంది. అమెరికాలోని అరిజోనాకు చెందిన 48 ఏళ్ల జెనెడా బెనెల్లీ గత ఏడాది దానిని దత్తత తీసుకున్నారు.
ఎక్కువ రోజులు బతకదని తెలిసినా..
అరిజోనాలో అనాథగా ఉన్న ఈ కుక్క ఎక్కువ కాలం బతకదని వెటర్నరీ డాక్టర్లు గుర్తించారు. బతికినన్ని రోజులు మందులు వాడుతూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఇవన్నీ తెలిసిన బెనెల్లీ దయార్ధ్ర హృదయంతో తెచ్చుకున్నారు. మిస్టర్ హ్యాపీ ఫేస్ అని పేరు పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇటీవలే పోటీలకు తీసుకెళ్తే.. ‘వరల్డ్ అగ్లీయెస్ట్ డాగ్’ అవార్డు వచ్చింది. దీనిపై బెనెల్లీ పాజిటివ్ గా స్పందించారు. ‘‘మిస్టర్ హ్యాపీ ఫేస్ అందవికారానికి కాదు.. అంతః సౌందర్యానికి వచ్చిన గుర్తింపుగా ఈ అవార్డును భావిస్తాను’’ అని బెనెల్లీ చెబుతున్నారు. ఈ బహుమతి కింద రూ.లక్షా 20వేల నగదు కూడా అందనుండటం గమనార్హం.