Maharashtra: మహారాష్ట్రలో మరో మంత్రికీ సోకిన కరోనా
![maharashtra minister Chhagan Bhujbal tests positive for corona](https://imgd.ap7am.com/thumbnail/cr-20220627tn62b9b15435430.jpg)
- ఇప్పటికే కరోనా బారిన పడిన సీఎం, డిప్యూటీ సీఎంలు
- తనకూ కరోనా సోకిందని భుజ్‌బల్ వెల్లడి
- తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని వినతి
రాజకీయ సంక్షోభం నెలకొన్న మహారాష్ట్రలో మరో మంత్రికీ కరోనా సోకింది. ఎన్సీపీ సీనియర్ నేత, ఉద్ధవ్ థాకరే కేబినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న చగన్ భుజ్‌బల్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. పవార్‌కు కరోనా నిర్ధారణ అయిన గంటల వ్యవధిలోనే తనకు కూడా కరోనా సోకిందంటూ భుజ్‌బల్ ట్వీట్ చేశారు. తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే తనకు కరోనా సోకిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సంక్షోభం నివారణ కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఆయన తప్పనిసరిగా ఆయా నేతలతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ఎన్సీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవార్‌కు కరోనా సోకిందన్న వాదనలు వినిపించాయి.