Maharashtra: మహారాష్ట్రలో మలుపు తిరుగుతున్న రాజకీయం.. ఎంఎన్​ఎస్​ అధినేత రాజ్​ థాకరేకు ఏక్​నాథ్​ షిండే ఫోన్​!

Eknath Shinde speaks to MNS chief Raj Thackeray

  • రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చ
  • ముంబై పేలుళ్ల నిందితుడు దావుద్ కు శివసేన మద్దతిస్తోందని షిండే ఆరోపణ
  • అనర్హత నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏక్ నాథ్

మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అధికార శివసేన భావిస్తోంది. దాన్ని సవాల్ చేస్తూ తిరుగుబాటు నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేతో మాట్లాడటం చర్చనీయాంశమైంది.

రాజ్ థాకరేకు ఫోన్ చేసిన షిండే రాష్ట్రంలోని ఇటీవలి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడినట్లు ఎంఎన్ఎస్ నాయకుడు ఒకరు సోమవారం ధ్రువీకరించారు. రాజ్ థాకరేతో ఫోన్‌లో షిండే రెండుసార్లు మాట్లాడారని, ఆయన ఆరోగ్యం గురించి కూడా వాకబు చేశారని తెలిపారు. దాంతో, మహారాష్ట్రలో రాజకీయం మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇక, ముంబై బాంబు పేలుడు నిందితుడు దావూద్ ఇబ్రహీంతో పాటు అమాయకుల ప్రాణాలను తీయడానికి కారణమైన వారికి మద్దతు ఇస్తున్నారని శివసేనపై షిండే ఆదివారం తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని, దానికంటే చనిపోవడం మేలు అని ఆయన వ్యాఖ్యనించారు. ‘ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం, ముంబైలోని అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న వారితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వ్యక్తులకు బాలా సాహెబ్ థాకరే స్థాపించిన శివసేన ఎలా మద్దతు ఇస్తుంది? దాని కంటే చావడం మంచిది’ అని ట్వీట్ చేశారు. అందుకే తాము ఇలాంటి చర్య (తిరుగుబాటు) తీసుకున్నామని స్పష్టం చేశారు. 

 హిందుత్వ భావజాలాన్ని అనుసరించడానికి తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినా... దాన్ని తమ విధిగా భావిస్తామని షిండే స్పష్టం చేశారు. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను సజీవ శవాలు, వారి ఆత్మలు చనిపోయాయి అంటూ విమర్శించిన నేపథ్యంలో షిండే ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్‌ జారీ చేసిన అనర్హత నోటీసులపై షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన స్థానంలో శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని నియమించడాన్ని కూడా ఈ పిటిషన్ సవాలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా డిప్యూటీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలని షిండే కోరారు.

More Telugu News