Telangana: అప్పు చేశా, తప్పు చేయలేదు... ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు
![jupalli krishna rao says will file defamation suit against mla harshavardhan reddy](https://imgd.ap7am.com/thumbnail/cr-20220626tn62b80c8d3a3ab.jpg)
- ఫ్రుడెన్షియల్ బ్యాంకులో రూ.7 కోట్ల రుణం తీసుకున్నానన్న జూపల్లి
- దానికి గాను రూ.14 కోట్లు చెల్లించానని వెల్లడి
- ఏ బ్యాంకు రుణాన్ని ఎగవేయలేదని వివరణ
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. తనపై అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేసేందుకు జూపల్లి సిద్ధమైపోయారు. తనపై ఆరోపణలు గుప్పించిన ఎమ్మెల్యేను బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన జూపల్లి.. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బైఠాయించిన జూపల్లి...ఎమ్మెల్యే కోసం మధ్యాహ్నం దాకా వేచి చూస్తానని ప్రకటించారు. తనతో చర్చకు భయపడ్డ హర్షవర్ధన్ పోలీసులతో అరెస్ట్ చేయించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా తనపై హర్షవర్ధన్ చేసిన ఆరోపణలకు సంబంధించి జూపల్లి కృష్ణారావు వివరణ ఇచ్చారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో నిజాయితీగా రాణిస్తున్నానని ఆయన చెప్పారు. తనపై ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని, వాటి కారణంగా తనకు బాధ కలిగిందని ఆయన చెప్పారు. తాను ఏ బ్యాంకు రుణాలు ఎగ్గొట్టలేదని ఆయన తెలిపారు. ఫ్రుడెన్షియల్ బ్యాంకు నుంచి తాను రూ.7 కోట్లు రుణం తీసుకున్నానని, దానికి గానూ 2007లో రూ.14 కోట్లు చెల్లించి రుణాన్ని క్లియర్ చేశానన్నారు. అయితే ఆ రుణాన్ని కాస్త ఆలస్యంగా చెల్లించానని జూపల్లి చెప్పారు.
తాను అప్పు చేశాను తప్పించి తప్పు చేయలేదని జూపల్లి చెప్పుకొచ్చారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే... జూపల్లిలో బహిరంగ చర్చకు బయలుదేరిన హర్షవర్ధన్ రెడ్డిని ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.