TDP: ఏ పార్టీతో పొత్తు లేకున్నా 160 సీట్లు గెలుస్తాం: టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు
![ex minister prattipati pullarao comments on tdp alliances](https://imgd.ap7am.com/thumbnail/cr-20220626tn62b806e4b184d.jpg)
- చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి
- చంద్రబాబు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్న మాజీ మంత్రి
- జగన్ అసమర్థ పాలనలో ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం
- వైసీపీ ప్లీనరీలకు సొంత పార్టీ వారే ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా
రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండానే సింగిల్‌గా 160 సీట్లను గెలిచే సత్తా టీడీపీకి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా వైసీపీ పాలనపై ప్రత్తిపాటి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ అసమర్థ పాలనలో ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేతలతోనే సరిపోయిందన్నారు. విషపూరిత మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరుతో ఎంత అవినీతి చేశారో ప్రజలందరికీ తెలుసన్న ప్రత్తిపాటి.. వైసీపీ ప్లీనరీలకు రావడానికి సొంత పార్టీ వారే ముఖం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు.