ATC Tyres: విశాఖలో ఏటీసీ టైర్స్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలంటూ సీఎం జగన్ కు ఆహ్వానం
- విశాఖలోని అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ ప్లాంట్
- రూ.1,750 కోట్లతో నిర్మాణం
- ఆగస్టులో ప్రారంభం
- సీఎం జగన్ ను కలిసిన కంపెనీ ప్రతినిధులు
విశాఖపట్నంలోని అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ భూముల్లో ఏటీసీ టైర్స్ ప్లాంట్ నిర్మితమైంది. ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఏర్పాటైన ఈ ప్లాంట్ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఏటీసీ టైర్స్ సంస్థ డైరెక్టర్ తోషియో ఫుజివారా, ఇతర ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. కంపెనీ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానించారు. టైర్స్ ప్లాంట్ కు సంబంధించిన వివరాలను వారు సీఎంకు వివరించారు.
జపాన్ కు చెందిన ది యోకోహామా రబ్బర్ కో లిమిటెడ్ కు ఏటీసీ టైర్స్ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ. ఏటీసీ టైర్స్, దాని అనుబంధ సంస్థలు కలిసి ఏటీజీ (అలయెన్స్ టైర్ గ్రూప్) పేరిట 120 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఆఫ్ హైవే టైర్ల రంగంలో ఏటీజీ బ్రాండ్ కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.
ఏటీసీకి భారత్ లో ఇప్పటికే గుజరాత్ లోని దహేజ్ లోనూ, తమిళనాడులోని తిరునల్వేలిలోనూ ప్లాంట్లు ఉన్నాయి. తాజాగా, విశాఖపట్నం అచ్యుతాపురంలో రూ.1,750 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీని రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 135 మెట్రిక్ టన్నులు. ఈ ప్లాంట్ ద్వారా 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.