Kailas Patil: షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడి కారణంగా సంతకాలు చేశారు: ఎమ్మెల్యే కైలాస్ పాటిల్
- మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం
- 42 మంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకున్న షిండే
- శివసేన నాయకత్వంపై అనిశ్చితి
- తాము సీఎం వెంటే ఉంటామన్న కైలాస్ పాటిల్
మహారాష్ట్ర ప్రభుత్వంలో పుట్టిన ముసలం కొనసాగుతోంది. మంత్రి ఏక్ నాథ్ షిండే పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని తొలుత సూరత్, ఆపై అసోం వెళ్లి క్యాంపు రాజకీయాలకు తెరలేపడం తెలిసిందే. అయితే, ఎమ్మెల్యేలను సూరత్ తీసుకెళ్లే క్రమంలో, ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ తాను వెనక్కి వెళ్లిపోతానంటూ మధ్యలోనే కారు దిగి, కాలినడకన కొంతదూరం, బైక్ పై కొంతదూరం, ట్రక్కులో కొంతదూరం ప్రయాణించి ముంబయి చేరుకున్నారు.
తాజాగా, కైలాస్ పాటిల్ మాట్లాడుతూ, షిండే వెంట ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు తీవ్ర ఒత్తిడి కారణంగానే సంతకాలు చేశారని వెల్లడించారు. తాము మాత్రం సీఎం వెంటే ఉంటామని పాటిల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తీసుకునే ఏ నిర్ణయాన్నయినా గౌరవిస్తామని పేర్కొన్నారు.
అటు, అసలైన శివసేన పార్టీ తమదేనని తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్ నాథ్ షిండే అంటున్నారు. పార్టీపై పట్టుకు 37 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, ఆయన వద్ద ఇప్పుడు 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.