Telangana: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి పూర్తి సిలబస్ అమలు!
- కరోనా వల్ల గత రెండేళ్లు 70 శాతం సిలబస్ మాత్రమే అమలు
- ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
- వంద శాతం సిలబస్ అమల్లో ఉంటుందని ప్రకటన
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్ అమలు కానుంది. కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. తరగతులను సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఉండటంతో సిలబస్ ను 30 శాతం తొలగించారు. దానికి అనుగుణంగానే ఎంసెట్ లో సైతం 70 శాతం సిలబస్ నుంచే పరీక్షలను నిర్వహించారు.
ఇప్పుడు కరోనా అదుపులో ఉన్న నేపథ్యంలో టీఎస్ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ విద్యా సంవత్సరంలో పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని... ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు వంద శాతం సిలబస్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఇంటర్ బోర్డు వెబ్ సైట్లో అప్ లోడ్ చేస్తామని చెప్పారు.