walnuts: వాల్ నట్స్ ఎన్ని విధాలుగా మేలు చేస్తాయో తెలుసా..?
- నిత్యం 28 గ్రాముల వాల్ నట్స్ తీసుకోవచ్చు
- వీటిల్లో గుండెకు మేలు చేసే ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్
- రోగ నిరోధక వ్యవస్థకు ప్రేరణ
- బరువు నియంత్రణలోనూ వీటి పాత్ర
తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండాలి. అప్పుడే అది మనకు ఉపయోగకరం. పోషకాలు లేని లేదా అతి తక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే, అనారోగ్య సమస్యలకు మన శరీరాన్ని కేంద్రం చేయడమే అవుతుంది. అందుకే సరైన పోషకాలతో కూడిన ఆహారంతో జీవన శైలి ఉండాలి. దీనివల్ల ఆరోగ్య సమస్యల్లేకుండా హాయిగా జీవించొచ్చు.
మంచి పోషకాలు కలిగిన వాటిల్లో వాల్ నట్స్ కూడా ఒకటి. కొంచెం ఖరీదైనవే అయినా.. నిత్యం కొన్ని వాల్ నట్స్ ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచి జరుగుతుందని పోషకాహార నిపుణుల సూచన. పరోక్షంగా ఆరోగ్యంపై పెట్టే ఖర్చును ఆదా చేసుకున్నట్టు అవుతుంది. 28 గ్రాముల వాల్ నట్స్ లో 4 గ్రాముల ప్రొటీన్, 2 గ్రాముల ఫైబర్, 2.5 గ్రాముల ప్లాంట్ ఆధారిత ఒమెగా ఫ్యాటీ 3 (గుండెకు మేలు చేసేవి) యాసిడ్స్ లభిస్తాయి. ఇవన్నీ కూడా మన గుండె, మెదడు, పేగుల ఆరోగ్యానికి సాయపడేవి. వాల్ నట్స్ లో క్యాలిఫోర్నియా వాల్ నట్స్ మరింత నాణ్యమైనవి.
గుండె ఆరోగ్యానికి..
వాల్ నట్స్ లో ఉండే ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ గుండె జబ్బులు, స్ట్రోక్ రిస్క్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం, రక్తపోటు నియంత్రణకు సాయపడుతుంది. రక్తపోటు కూడా గుండె జబ్బులకు పెద్ద రిస్క్ అన్న విషయం తెలిసిందే.
వ్యాధి నిరోధక శక్తి
వాల్ నట్స్ లోని విటమిన్ బీ, జింక్, సిలీనియం ఈ మూడు మన వ్యాధి నిరోధక శక్తి చురుగ్గా పనిచేసేలా సాయపడతాయి. కరోనా సమయంలో వాల్ నట్స్ ను తినాలన్న సూచనలు వినే ఉంటారు.
బరువు నియంత్రణ
బరువు తగ్గించుకోవాలని, పరిమితి మించకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఎందుకంటే అధిక బరువు కారణంగా వచ్చే సమస్యలు ఎన్నో ఉన్నాయి. వ్యాయామం చేయడంతోపాటు.. కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా బరువు తగ్గించుకునే మార్గం. వాల్ నట్స్ ను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సమయం పాటు ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. దీనివల్ల ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. అస్తమానం నోరాడించడం తగ్గుతుంది. ఈ రకంగా కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇందులోని ఫైబర్ పేగుల ఆరోగ్యానికీ మంచి చేస్తుంది. సాఫీ విరేచనానికి సాయపడుతుంది.
మధుమేహం రిస్క్
నేడు జీవనశైలి వ్యాధుల్లో ఎక్కువగా కనిపించేవి రక్తపోటు, మధుమేహం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్. వాల్ నట్స్ మధుమేహం నియంత్రణలో పెట్టుకోవడానికి సాయపడతాయని పలు పరిశోధనలు తేల్చాయి. అమెరికాలో 34,000 మందిపై అధ్యయనం నిర్వహించారు. రోజవారీ వాల్ నట్స్ తిన్న వారిలో (తినని వారితో పోలిస్తే) టైప్ 2 డయాబెటిస్ రిస్క్ సగం తగ్గినట్టు తేలింది.