Rishabh pant: నేనైతే ‘పంత్’ కెప్టెన్సీని అడ్డుకుంటా: మాజీ సెలక్టర్
- అతడు చాలా చిన్న వాడన్న మదన్ లాల్
- ఇంకా పరిపూర్ణత అవసరమన్న అభిప్రాయం
- కనీసం ఓ రెండేళ్ల సమయం ఇచ్చి చూడాలన్న సూచన
రిషబ్ పంత్ తొలిసారి భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించి ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికాతో తొలి రెండు టీ20ల్లో ఓడినా, తర్వాతి రెండు మ్యాచుల్లో గెలిపించి సిరీస్ ను సమం చేశాడు. పంత్ యువకుడని.. అతడు నేర్చుకుంటున్నాడని.. భవిష్యత్తులో ఇంకా రాణిస్తాడని చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. దీంతో భవిష్యత్తు టీమిండియా కెప్టెన్ పోటీదారుల్లో పంత్ కూడా ఒకడిగా చేరిపోయాడు.
కానీ, టీమిండియా మాజీ సెలక్టర్ మదన్ లాల్ మాత్రం తానైతే రిషబ్ పంత్ కెప్టెన్ కాకుండా అడ్డుకుని ఉండేవాడినని చెప్పడం గమనార్హం. ‘‘నేనైతే ఇలా జరగనిచ్చేవాడిని (పంత్ కు కెప్టెన్సీ ఇవ్వడం) కాదు. ఎందుకంటే అటువంటి ఆటగాడికి కెప్టెన్ బాధ్యతలను తర్వాత అప్పగించాలి. భారత కెప్టెన్ అవ్వడం అన్నది చాలా పెద్ద డీల్. కానీ, అతడు చిన్న వాడు. ఎక్కువ కాలం పాటు ఆడితే అతడు మరింత పరిపూర్ణత సాధిస్తాడు’’ అని మదన్ లాల్ ఓ వార్తా సంస్థతో పేర్కొన్నాడు.
కెప్టెన్సీకి బలమైన అభ్యర్థిగా పంత్ ను పరిగణనలోకి తీసుకోవడానికి ముందు.. బ్యాటింగ్, కెప్టెన్సీలో పరిపక్వత చూపించేందుకు అతడికి కనీసం రెండేళ్ల సమయమైనా అవసరమని మదన్ లాల్ అభిప్రాయపడ్డాడు. వచ్చే రెండేళ్లలో తన పనితీరును మరింత మెరుగుపరుచుకుంటే అతడు మంచి కెప్టెన్ అవుతాడని పేర్కొన్నాడు.