Uddhav Thackeray: శివసేనలో ముసలం.. అత్యవసర సమావేశానికి ఉద్ధవ్ థాకరే పిలుపు

Thackeray calls urgent meet after Sena loses touch with top minister

  • ఆచూకీ లేకుండా పోయిన మంత్రి ఏక్ నాథ్ షిండే 
  • ఆయన వెంట 11-12 మంది ఎమ్మెల్యేలు
  • సూరత్ లోని ఓ హోటల్లో బస
  • ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఊహించని పరిణామాలు

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో ముసలం పుట్టింది. మంత్రి ఏక్ నాథ్ షిండే అందుబాటులో లేకుండా పోయారు. ఆయన వెంట మరో 11-12 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తాజా సమాచారం. వీరంతా గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని ఓ హోటల్లో బస చేసినట్టు తెలుస్తోంది.

థానే ప్రాంతానికి చెందిన ఏక్ నాథ్ షిండేకు మంచి ప్రజాదరణ ఉంది. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. శివసేన అభ్యర్థులు ఇద్దరే గెలిచారు. తమ అభ్యర్థులకు 64 ఓట్లు వస్తాయని శివసేన అంచనా వేసుకోగా, 52 మాత్రమే వచ్చాయి. ఇందులో 55 సొంత ఓట్లు కాగా.. మిగిలినవి స్వతంత్రులు, చిన్న పార్టీలకు సంబంధిచినవి. 64 మంది ఎమ్మెల్యేలలో కనీసం 12 మంది వరకు క్రాస్ ఓటింగ్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఫలితంగా నాలుగు స్థానాలు గెలవాల్సిన బీజేపీ ఐదు స్థానాల్లో గెలవడం దీన్నే సూచిస్తోంది.

2019లో మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానంలో మహారాష్ట్ర వికాస్ అగాడీ (ఎంవీఏ) సర్కారుకు 169 ఓట్లు వచ్చాయి. కానీ, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 150 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ సొంత బలంతో నాలుగు గెలుచుకోగా, ఐదో అభ్యర్థి ప్రసాద్ లాడ్ సైతం ఇతర పార్టీల్లోని వారి మద్దతుతో గెలవడం విశేషం.  

తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన నివాసంలో మంగళవారం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. దీంతో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, షిండే పార్టీకి దూరమైనా మహారాష్ట్ర సర్కారుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. 288 సభ్యులు గల సభలో ఎంవీఏకు 169 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీ బలం కేవలం 113 స్థానాలుగా ఉంది. 

మరోవైపు షిండే తమతో టచ్ లో ఉన్నాడన్న వార్తలను బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ ఖండించారు. పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తుంటామని.. మహారాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News