Andhra Pradesh: ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ అప్పులు తక్కువే: కాగ్ నివేదికను ఉటంకించిన వైసీపీ
- ఏపీ అప్పుల ఊబిలో ఉందంటున్న విపక్షాలు
- మరో శ్రీలంక అంటూ విమర్శలు
- ఏపీ అప్పు 2.10 శాతమేనని వైసీపీ స్పష్టీకరణ
- తెలంగాణ ద్రవ్యలోటు 4.13 శాతం అని వెల్లడి
ఏపీని అప్పులకుప్పగా మార్చేశారని, ఏపీ మరో శ్రీలంకలా తయారవడం ఖాయమని విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుండడం తెలిసిందే. దీనిపై వైసీపీ సోషల్ మీడియాలో స్పందించింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ తీసుకున్న అప్పు తక్కువేనని కాగ్ పేర్కొందని తెలిపింది. 2021-22లో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ద్రవ్యలోటు అత్యల్పం అని కాగ్ వివరించినట్టు తెలిపింది.
వైసీపీ తెలిపిన వివరాల ప్రకారం... ఏపీ నికర అప్పు (2021-22) విలువ 2.10 శాతం. అదే సమయంలో కేరళ నికర అప్పు విలువ 4.74 శాతం కాగా, తెలంగాణ 4.13 శాతం, తమిళనాడు 3.50 శాతం, మధ్యప్రదేశ్ 3.18 శాతం, కర్ణాటక నికర అప్పు విలువ 2.95 శాతం అని వైసీపీ వివరించింది.