TDP: జగన్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపాలి: చంద్రబాబు
![chandrababu harsh comments on ys jagan regime in chodavaram mini mahanadu](https://imgd.ap7am.com/thumbnail/cr-20220615tn62a9e6138f148.jpg)
- చోడవరం నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం
- మినీ మహానాడుకు భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
- రాష్ట్రంలో తిరుగుబాటుకు సమయం వచ్చిందన్న బాబు
- సీబీఐపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపణ
- కోడికత్తి నాటకమాడి సానుభూతి సంపాదించారన్న చంద్రబాబు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. జగన్ ఉన్నంత వరకు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావని, రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రావని ఆయన ధ్వజమెత్తారు. జిల్లాల పర్యటనను బుధవారం ప్రారంభించిన చంద్రబాబు... తొలి రోజు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు పేరిట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. పార్టీ శ్రేణుల ఉత్సాహం చూసిన చంద్రబాబు... జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో నెలకు లక్ష రూపాయల వేతనం వచ్చే ఉద్యోగాలు ఇస్తే... జగన్ మాత్రం నెలకు రూ.5 వేల జీతం ఇచ్చే వలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన విరుచుకుపడ్డారు. కూలి పని చేసుకునే వారికి కూడా నెలకు రూ.15 వేలు వస్తోంది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. రోడ్ల గుంతలు పూడ్చలేని వ్యక్తి 3 రాజధానులు కడతారా? అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజల్లో వ్యతిరేకత చూసి జగన్‌కు భయం పట్టుకుందని ఆయన ఆరోపించారు.
గడచిన ఎన్నికల్లో జగన్ ఎలా గెలిచారన్న అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... కోడికత్తి నాటకమాడి సానుభూతి సంపాదించారని ఆరోపించారు. సొంత బాబాయిని చంపి తనపై నేరం వేసి ప్రజల నుంచి సానుభూతి సంపాదించారని జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో ఏ2 పెత్తనం చేస్తున్నారని సాయిరెడ్డిపై చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.
వైసీపీ పాలనలో అన్ని వర్గాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారన్న చంద్రబాబు... వైసీపీ బెదిరింపులకు సీబీఐ పారిపోయినా టీడీపీ పారిపోదన్నారు. ముఠా నాయకులనే అణచివేసిన పార్టీగా టీడీపీని ఆయన అభివర్ణించారు. ఎన్ని ప్రాణాలు పోయినా వైసీపీ నేతలను వదిలిపెట్టబోమని చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో పోయే ప్రతి ప్రాణం ఆ పార్టీ నేతల మెడకు ఉరితాడుగా మారుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో తిరుగుబాటుకు సమయం వచ్చిందన్న చంద్రబాబు.. రివర్స్ పాలనకు రివర్స్ ట్రీట్‌మెంట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు.
ఇక తన జిల్లాల పర్యటన గురించి మరిన్ని వివరాలు వెల్లడించిన చంద్రబాబు.. రాష్ట్రంలో మొత్తం 26 మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏజెన్సీలో 2 మహానాడులు నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు.. 15 రోజులకు ఓ మహానాడు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామంలో సమస్యలపై మహానాడులో చర్చిస్తామని ఆయన తెలిపారు.