Vladimir Putin: పుతిన్ కు ఓ ప్రత్యేక బాడీగార్డు... అతడి పనేంటో తెలుసా...?
- పుతిన్ వెంట సూట్ కేస్ తో ఓ వ్యక్తి
- పుతిన్ మలమూత్రాలను సేకరించడమే అతడి పని
- మలమూత్రాల విశ్లేషణతో రోగాల గుట్టు తెలుస్తుందని పుతిన్ భయం
- ఓ ఫ్రెంచ్ పత్రిక కథనం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ పై అంతర్జాతీయ మీడియా దృష్టి సారించడం కొత్తేమీ కాదు. ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలుపెట్టాక పుతిన్ వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య రహస్యాలు అన్నీ మీడియాలో ప్రముఖంగా దర్శనమిస్తున్నాయి. తాజాగా 'ఫాక్స్ న్యూస్' అత్యంత ఆసక్తికరమైన సంగతి వెల్లడించింది. పుతిన్ బృందంలో ఓ ప్రత్యేకమైన బాడీగార్డు ఎల్లవేళలా అంటిపెట్టుకునే ఉంటాడని, పుతిన్ విసర్జించే మలమూత్రాలను ఎప్పటికప్పుడు సేకరిస్తుండడమే అతడి పని అని వివరించింది.
పుతిన్ ఆరోగ్యంపై తీవ్ర అనిశ్చితి నెలకొన్న తరుణంలో, పుతిన్ మలమూత్రాలు శత్రువుల చేతుల్లో పడితే ఆయన అనారోగ్యాలకు చెందిన రహస్యాలు బట్టబయలవుతాయన్నది రష్యా ప్రభుత్వ భయం అని ఫాక్స్ న్యూస్ పేర్కొంది. కాగా, దీనికి సంబంధించిన తొలి కథనం 'పారిస్ మ్యాచ్' అనే ఫ్రెంచ్ మ్యాగజైన్ లో ప్రచురితమైంది. దాంతో ఇతర మీడియా సంస్థలు కూడా ఫ్రెంచ్ పత్రిక కథనం ఆధారంగా వార్తలు ప్రచురించాయి.
"తన ఆరోగ్య సమాచారం విదేశీ నిఘా సంస్థల చేతుల్లోకి వెళుతుందేమోనని పుతిన్ భయపడుతుంటాడు. ఊపిరున్నంత వరకు రష్యాను తానే పాలించాలన్నది పుతిన్ వాంఛ. అందుకే అధికార మార్పిడికి దోహదపడే ఏ అంశాన్నీ ఆయన ఉపేక్షించరు" అంటూ డీఐఏ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి రెబెకా కోఫ్లర్ ను ఉటంకిస్తూ ఫాక్స్ న్యూస్ వివరించింది.
పుతిన్ విదేశీ పర్యటనల్లో ప్రత్యేక బాడీగార్డు ఓ స్పెషల్ సూట్ కేస్ తో తిరుగుతుంటాడని, పుతిన్ విసర్జించే మలమూత్రాలను ప్రత్యేక ప్యాకెట్లలో ఉంచి మాస్కో తీసుకురావడం అతడి విధి అని ఫ్రెంచ్ మ్యాగజైన్ పేర్కొంది. 2019లో ఫ్రాన్స్ పర్యటన సందర్భంగానూ, అదే ఏడాది అక్టోబరులో సౌదీ అరేబియా పర్యటన సందర్భంగానూ పుతిన్ మలమూత్రాలను ఏమాత్రం జారవిడవకుండా సేకరించారని వెల్లడించింది. పుతిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రత్యేక ఏర్పాటు కొనసాగుతోందని వివరించింది.
పుతిన్ ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్నారని, ఇంకా పలు వ్యాధులతో పోరాడుతున్నారని ఇటీవల వార్తలు వస్తుండడం తెలిసిందే.