ipl: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు లక్ష్మీ కటాక్షం.. పెట్టుబడిపై ఎన్నో రెట్ల ప్రతిఫలం
- ఏటా రూ.500 కోట్ల వరకు రాబడి
- ఐపీఎల్ ఆరంభంలో పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ
- జెర్సీలపై ప్రకటనలు, మ్యాచ్ టికెట్ల విక్రయాల రూపంలో అదనపు ఆదాయం
ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల వేలం బీసీసీఐకే కాదు.. ఫ్రాంచైజీలకు కూడా కాసుల వర్షం కురిపించనుంది. 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను బీసీసీఐ వేలం వేస్తోంది. నాలుగు ప్యాకేజీలుగా వేరు చేసి (టీవీ, డీజిటల్, వెబ్) ఆదివారం వేలం మొదలు కాగా, మొదటి రోజు ప్యాకేజీ ఏ, బీకి కలిపి రూ.43,000 వేల కోట్లకు బిడ్లు నమోదయ్యాయి. నేడు రెండో రోజు వేలం కొనసాగుతోంది. ప్యాకేజీ సీ, డీ కూడా కలుపుకుంటే మీడియా ప్రసార హక్కుల రూపంలో బీసీసీఐకి సుమారు రూ.50 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక వేలం రూపంలో వచ్చిన మొత్తం ఆదాయంలో సగం ఫ్రాంచైజీలకే వెళుతుంది. ఫ్రాంచైజీలు సెంట్రల్ రైట్స్ ఆదాయం నుంచి 50 శాతం పొందేలా బీసీసీఐ 2018లో నిర్ణయం తీసుకుంది. 2022 వరకు ఐపీఎల్ మీడియా హక్కులను స్టార్ ఇండియా రూ.16,347 కోట్లకు సొంతం చేసుకుంది. ఇందులో సగం బీసీసీఐకు పోను సుమారు రూ.8,000 కోట్లు (ఐదేళ్లకు) ఎనిమిది ఫ్రాంచైజీలు పంచుకునేవి. అంటే ఒక్కో ఫ్రాంచైజీకి ఏటా రూ.200 కోట్లు వస్తోంది.
కానీ, ఇప్పుడు మీడియా హక్కులు రూ.50 వేల కోట్లకు అమ్ముడుపోతే 10 ఫ్రాంచైజీలకు కలిపి ఐదేళ్ల కాలానికి రూ.25,000 కోట్లు వస్తాయి. ఒక్కో ఫ్రాంచైజీకి రూ.2,500 కోట్లు. అంటే ఏటా రూ.500 కోట్లు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. 2008లో ఐపీఎల్ మొదలైంది. నాడు అన్ని ఫ్రాంచైజీలు కలసి రూ.3,000 కోట్లకు అమ్ముడుపోయాయి. అంటే సగటున ఒక్కో ఫ్రాంచైజీ కోసం రూ.260-500 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టాయి. నాడు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే వస్తోంది.
ఇటీవల రెండు కొత్త ఫ్రాంచైజీలకు వేలం వేయగా.. అందులో లక్నో జట్టును ఆర్పీ సంజీవ్ గోయంకా గ్రూపు ఆర్పీఎస్జీ వెంచర్స్ రూ.7,000 కోట్లకుపైగా చెల్లించి సొంతం చేసుకుంటే, గుజరాత్ జట్టును సీవీసీ క్యాపిటల్స్ అనే ప్రైవేటు ఈక్విటీ సంస్థ రూ.5,000 కోట్లకు పైగా చెల్లించి సొంతం చేసుకుంది.
ఇప్పుడు మనం చెప్పుకున్నది కేవలం మీడియా రైట్స్ విక్రయం రూపంలో వచ్చే ఆదాయం గురించే. కానీ, ఫ్రాంచైజీలకు ఇతర ఆదాయం కూ డా వస్తుంది. వివిధ బ్రాండ్లకు ఆటగాళ్ల జెర్సీలపై స్థలాన్ని అద్దెకు ఇచ్చే రూపంలో, సొంత రాష్ట్రాల్లోని మైదానాల్లో ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఆదాయం, ఫ్రాంచైజీ పేరిట ఉత్పత్తుల విక్రయాల రూపంలో అదనపు ఆదాయ వనరులు ఉన్నాయి.