Perni Nani: పేర్ని నాని-ఎంపీ బాలశౌరి వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్.. అనవసర రచ్చ వద్దని వార్నింగ్

YCP High Command Fires on MP Balasouri and perni nani

  • పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ బాలశౌరి
  • టీడీపీ నేత కొనకళ్ల, బీజేపీ నేత సుజనా చౌదరితో అంటకాగుతున్నారని ఆరోపణ
  • మీడియాకెక్కి రచ్చ చేయడం ఏంటని అధిష్ఠానం ఆగ్రహం
  • తాడేపల్లికి పిలిపించి మాట్లాడనున్న అధిష్టానం

ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య చెలరేగిన వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్పితే ఇలా మీడియాకెక్కి రచ్చకెక్కడం సరికాదని, మౌనంగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఎంపీని అడ్డగించడం, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇద్దరినీ తాడేపల్లికి పిలిపించి మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బందరులో శ్మశానవాటిక పరిశీలనకు వెళ్లిన ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరులు, కార్పొరేటర్ అస్ఘర్ అలీ, సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

తనను అడ్డుకున్న వారిపై బాలశౌరి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘బందరు ఏమైనా నీ అడ్డానా?’ అంటూ మీడియా ముఖంగా పేర్ని నానిపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, బీజేపీ నేత సుజనా చౌదరి వంటి వారితో నాని అంటకాగుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో బందరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతేకాదు, బందరులో జరిగిన ఏ కార్యక్రమానికి ఎంపీకి ఆహ్వానం అందడం లేదని కూడా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇటీవల బందరు హార్బర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు కేంద్ర సహాయ మంత్రి వచ్చారు. ఆ కార్యక్రమంలో బాలశౌరి, పేర్ని నాని పాల్గొన్నప్పటికీ అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.

మరోవైపు, పేర్ని నానిపై బాలశౌరి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం.. అయిన రచ్చ గురించి మీడియాకెక్కడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు, నిన్న బందరులో పర్యటించిన బాలశౌరిని నానితో వివాదంపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ముక్తసరిగా జవాబిచ్చారు. అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు, పేర్ని నాని కూడా ఈ ఘటనపై ఇలాంటి సమాధానమే ఇచ్చారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News