Southwest Monsoon: తెలంగాణలో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు.. రుతుపవనాల రాక కోసం మరో రెండు రోజులు ఆగాల్సిందే!
- ఈ నెల 8నే తాకాల్సిన నైరుతి రుతుపవనాలు
- తప్పిన అంచనాలతో పెరిగిన ఎండలు
- తెలంగాణలో మిశ్రమ వాతావరణం
మూడు రోజుల క్రితమే తెలంగాణలోకి వస్తాయనుకున్న రుతుపవనాలు మొండికేస్తున్నాయి. వాటి రాక మరో రెండు రోజులు ఆలస్యమయ్యేలా ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి మరో రెండు రోజుల నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు. నిజానికి మూడు రోజుల ముందుగా గత నెల 29నే కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకడంతో తెలంగాణలోకి కూడా ముందే వస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
అయితే, ఆ అంచనాలు తప్పాయి. దీంతో తెలంగాణలో మిశ్రమ వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. ఫలితంగా ప్రజలు వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరు జల్లులు కురుస్తున్నాయి.
వాస్తవానికి ఈ నెల 8న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాల్సి ఉంది. అయితే, మందగమనం కారణంగా వాటి రాక మరో రెండు రోజులు పట్టేలా ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాలంటే అంతకంటే ముందు కర్ణాటక, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడాల్సి ఉంటుందని, కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయని తెలిపింది.