TDP: ప్రజల మీద తిరగబడమని ఎమ్మెల్యేలను జగన్ రెచ్చగొడుతున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడల
![tdp mp kanakamedala ravindrakumar fomments on ysrcp gadapagadapaku programme](https://imgd.ap7am.com/thumbnail/cr-20220609tn62a1bce3d0caf.jpg)
- గడపగడపకులో వైసీపీ నేతలు సమాధానాలే చెప్పలేకపోయారన్న కనకమేడల
- ఎమ్మెల్యేల సందేహాలకు జగన్ సమాధానం చెప్పలేకపోయారని విమర్శ
- టీడీపీ మహానాడును చూసి వైసీపీలో భయం పట్టుకుందని ఎద్దేవా
- ఆ భయంతోనే వైసీపీ వర్క్‌షాప్‌లు, ప్లీనరీలు అన్న కనకమేడల
ఏపీలో అధికార పార్టీ వైసీపీ మీద, ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పలు ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల మీద తిరగబడమని సీఎం జగన్ తన ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని కనకమేడల ఆరోపించారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానాలే చెప్పలేకపోయారని, ఈ క్రమంలో బుధవారం జరిగిన వర్క్ షాప్‌లో భాగంగా ప్రజల మీద తిరగబడేలా ఎమ్మెల్యేలను జగన్ రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలు లేవనెత్తిన సందేహాలకు జగన్ సమాధానం చెప్పలేకపోయారని కనకమేడల ఎద్దేవా చేశారు.
టీడీపీ ఇటీవలే నిర్వహించిన మహానాడుకు ఊహించని స్పందన లభించిందని, ఆ స్పందనను చూసి వైసీపీలో భయం మొదలైందని అన్నారు. ఈ భయంతోనే వైసీపీ వర్క్ షాప్‌ను నిర్వహించిందని కూడా ఆయన పేర్కొన్నారు. పార్టీని కాపాడుకోవడానికే జగన్ వర్క్ షాప్‌లు, ప్లీనరీలు అంటూ సాగుతున్నారని ఆయన ఆరోపించారు.