dutch: మాట్లాడే స్వేచ్ఛను కోల్పోవద్దు.. మరోసారి గళం విప్పిన డచ్ ఎంపీ

Dont lose freedom for economic reasons says Dutch MP

  • నుపుర్ శర్మ మాట్లాడింది తప్పు కాదన్న గీర్ట్ వైల్డర్స్
  • అందుకే ఆమెకు మద్దతుగా నిలబడతానని ప్రకటన
  • ఆమె తప్పు చేస్తే కోర్టులు తేలుస్తాయని కామెంట్ 
  • చంపుతామని బెదిరించే మూకలు కాదన్న ఎంపీ

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడిన బీజేపీ మాజీ నేత నుపుర్ శర్మకు మద్దతు పలికిన నెదర్లాండ్స్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ మరోసారి గళం విప్పారు. ఆర్థిక కారణాలు ఉన్నాయని చెప్పి ఏ దేశం కూడా స్వేచ్ఛను కోల్పోకూడదని సూచించారు. నిజం మాట్లాడినందుకు ఎవరినీ శిక్షించకూడదని లేదా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. స్వేచ్ఛ ప్రమాదంలో పడినట్టు ఆయన వ్యాఖ్యానించారు.

భారత్, నెదర్లాండ్స్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో చట్టబద్ధమైన పాలన ఉన్నట్టు గుర్తు చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు కోర్టులు తేల్చాలే కానీ, ఎవరినైనా చంపేస్తామంటూ బెదిరించే మూకలు కాదన్నారు. ‘‘ఆమె (నుపుర్ శర్మ) చెప్పింది నీకు నచ్చొచ్చు. నచ్చకపోవచ్చు. కానీ, ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ (భావ ప్రకటన స్వేచ్ఛ) ఎంతో ముఖ్యమైన విలువ’’ అని గీర్ట్ వైల్డర్స్ పేర్కొన్నారు.

‘‘నుపుర్ శర్మకు మద్దతు పలికినప్పటి నుంచి చంపేస్తామంటూ నాకెన్నో బెదిరింపులు వచ్చాయి. ఖురాన్ గురించి సినిమాలు తీసినందుకు నాకు ఫత్వాలు జారీ చేశారు. శర్మ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. ఆమె ఏమీ తప్పు చేయలేదు. అందుకే ఆమెకు మద్దతుగా నిలబడతాను. 

నేను ఫిత్నా అనే పేరుతో తీసిన సినిమాలో ఇస్లామిక్ భావజాలాన్ని విమర్శించాను. దీంతో అల్ ఖైదా, తాలిబాన్ తదితరుల నుంచి ఫత్వాలు వచ్చాయి. దీంతో నా ఇంటిని విడిచిపెట్టేశాను. ప్రభుత్వం కల్పించిన సురక్షితమైన ఇంట్లో ఉంటున్నాను. ఇస్లామ్ ను విమర్శించినందుకు 17 ఏళ్లుగా వీధుల్లో వెంట పోలీసులు లేకుండా నడిచి వెళ్లే అవకాశాన్ని కోల్పోయాను. నా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోయాను.

మన స్వేచ్ఛ కోసం ఒకరిని అర్థించే పరిస్థితి ఉండకూడదు. ఆమె (నుపుర్) ఒకవేళ తప్పు చేసి ఉంటే భారతీయ కోర్టులు నిర్ణయిస్తాయి. ఎందుకంటే భారత్ సౌర్వభౌమ దేశం’’ అని గీర్ట్ వైల్డర్స్ స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News