YSRCP: జీరో పెర్ఫార్మెన్స్‌తో ఏడుగురు ఎమ్మెల్యేలు... టికెట్లు ఇచ్చేది లేదన్న జగన్
- గడపగడపకుపై తాడేపల్లిలో జగన్ సమీక్ష
- పనితీరు బాగా లేని నేతలకు జగన్ హెచ్చరికలు
- పనితీరు మెరుగుపరచుకోకుంటే టికెట్లు ఇచ్చేది లేదని వెల్లడి
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇటీవలే మొదలుపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా జరిగిన కార్యక్రమంలో పార్టీ నేతలకు ఎదురైన అనుభవాలు, ప్రజలు ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు, కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడం ఎలా అన్న అంశాలపై చర్చించేందుకే జగన్ ఈ సమీక్షను నిర్వహిస్తున్నారన్న విషయం తెలిసిందే. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరయ్యారు.
ఈ సమీక్షకు ముందే... గడపగడపకు కార్యక్రమంలో పార్టీ నేతల పనితీరుపై జగన్ ఓ నివేదిక తెప్పించుకున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం నాటి సమీక్షలో జగన్ ఆ నివేదికను బయటకు తీశారు. ఈ నివేదికలో పలువురి పనితీరు బాగానే ఉన్నా...ఓ ఏడుగురు ఎమ్మెల్యేల పెర్ఫార్మెన్స్ జీరోగా ఉందట. ఈ ఏడుగురు ఇళ్లు కదలకుండానే... తమ అనుచరులను పంపుతూ కార్యక్రమాన్ని నెట్టుకొస్తున్నారట. ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించిన జగన్... ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.