Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మిథాలీరాజ్

Mithali Raj retires from international cricket

  • అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగిన మిథాలీ రాజ్
  • 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మిథాలీ
  • అందరి ఆశీర్వాదాలతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వ్యాఖ్య

భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగారు. కాసేపటి క్రితం ఆమె తన రిటైర్మెంట్ ను ప్రకటించారు. ప్రపంచ మహిళా క్రికెట్ లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఘనత మిథాలీ రాజ్ తరపున ఉంది. ఇండియా తరపున ఆమె 232 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు. 50.68 యావరేజ్ తో 7,805 పరుగులను సాధించారు. 1999 జూన్ లో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. 

ఇండియా తరపున 82 టీ20 మ్యాచ్ లు ఆడిన మిథాలీ 2,364 పరుగులు చేశారు. భారత మహిళా బ్యాట్స్ మెన్లలో అత్యధిక టీ20 పరుగులు సాధించిన ఘనత మిథాలీ పేరిటే ఉంది. అంతేకాదు, భారత్ తరపున 12 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన మిథాలీ 699 పరుగులు చేశారు. 2002లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ఒక ఇన్నింగ్స్ లో ఆమె 214 పరుగులు చేశారు. మహిళా టెస్ట్ క్రికెట్లో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 8 సెంచరీలు, 85 అర్ధ శతకాలను సాధించారు. 

ఈ సందర్భంగా మిథాలీ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఇన్నేళ్ల పాటు మీరందరూ అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మీ అందరి ఆశీర్వాదాలతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని చెప్పారు. గత 23 ఏళ్ల క్రికెట్ జీవితంలో ఎన్నో నేర్చుకున్నానని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని... ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించానని అన్నారు. అన్ని ప్రయాణాల మాదిరే ఈ ప్రయాణం కూడా ముగిసిందని చెప్పారు. 

మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి మన దేశ గెలుపుకోసం తన వంతు కృషి చేశానని మిథాలి తెలిపారు. తనకు ఎంతో సహకరించిన బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నానని చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.

Mithali Raj
Retirement
  • Loading...

More Telugu News