Spokes Persons: ఆవేశానికి లోనుకావొద్దు... ఆలోచించి మాట్లాడండి: అధికార ప్రతినిధులకు బీజేపీ కొత్త మార్గదర్శకాలు

BJP new guidelines for party spokespersons

  • నుపుర్ వ్యాఖ్యలతో భారత్ కు ఇబ్బందికర పరిస్థితి
  • అంతర్జాతీయంగా విమర్శలు
  • భారత్ ను వేలెత్తి చూపిస్తున్న ఇస్లామిక్ దేశాలు
  • కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ!

ఓ టీవీ చానల్ డిబేట్ లో మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యల ఫలితంగా ముస్లిం ప్రపంచం నుంచి భారత్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. టీవీ చానళ్లలో చర్చలు, మీడియా సమావేశాలకు హాజరయ్యే పార్టీ అధికార ప్రతినిధులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం అధికార ప్రతినిధులు, ప్యానెల్ సభ్యులు మాత్రమే టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది. 

ఏదైనా ఒక టీవీ షోలో పాల్గొనే ముందు, సంబంధిత అంశంలో బాగా సన్నద్ధమవ్వాలని, పార్టీ వైఖరి ఏంటనేది తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికింది. ఆవేశానికి లోను కాకుండా, ఆలోచించి మాట్లాడాలని సూచించింది. మత చిహ్నాల గురించి ఎట్టిపరిస్థితుల్లోనూ మాట్లాడొద్దని పేర్కొంది. 

భాషను నియంత్రించుకోవాలని, ఉద్వేగానికి లోనై అదుపు కోల్పోరాదని తెలిపింది. ముఖ్యంగా, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ సిద్ధాంతాలను ఉల్లంఘించరాదని ఆదేశించింది. ఎదుటివాళ్లు రెచ్చగొడుతున్నప్పటికీ పార్టీ భావజాలానికే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News