YSRCP: జగన్‌కు చేరిన 'గడపగడపకు' నివేదిక!... ఎల్లుండి జరిగే సమీక్షకు హాజరయ్యేది వీరే!
- బుధవారం తాడేపల్లిలో సమీక్ష
- గడపగడపకుపైనే కీలక చర్చ
- పార్టీ బాధ్యుల నుంచి వివరాలు సేకరించనున్న జగన్
- మంత్రులు, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ నిర్వహిస్తున్న 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ఇప్పటిదాకా సాగిన ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇప్పటికే జగన్ చెంతకు చేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నివేదికను ఇప్పటికే పరిశీలించిన జగన్...ఈ కార్యక్రమంపై ఎల్లుండి (బుధవారం) ఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే... బుధవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మొదలు కానున్న ఈ సమీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా గడపగడపకు మన ప్రభుత్వంలో ఎదురైన అనుభవాలను స్వయంగా పార్టీ బాధ్యుల నుంచే జగన్ తెలుసుకోనున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ బాధ్యులు చెప్పిన దానిని తనకు అందిన నివేదికతో పోల్చి చూడనున్న జగన్ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించడంపై పార్టీ శ్రేణులకు దిశార్దేశం చేయనున్నట్లుగా సమాచారం.