Ancient City: ఎండిపోయిన జలాశయం కింద బయల్పడిన వేల ఏళ్ల నాటి నగరం
- ఇరాక్ లో ప్రాచీన నగరం గుర్తింపు
- దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
- ఎండిపోయిన టైగ్రిస్ నది
- ఓ జలాశయంలో తవ్వకాలు చేపట్టిన జర్మనీ, కుర్దు పరిశోధకులు
- 3,400 ఏళ్ల నాటి నగరం బయల్పడిన వైనం
ఇరాక్ లో ఓ ప్రాచీన నగరం బయల్పడింది. కుర్దుల ప్రాబల్యం ఉండే కెమూన్ ప్రాంతంలో ఓ జలాశయం ఎండిపోగా, అక్కడ ఓ పురాతన నగరం ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. ఇది 3,400 ఏళ్ల నాటి నగరం అని భావిస్తున్నారు. 1550 బీసీ నుంచి 1350 బీసీ వరకు విలసిల్లిన మిట్టానీ సామ్రాజ్యంలో ఈ నగరం కూడా ఒక భాగమై ఉంటుందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
ఇరాక్ లో ఇటీవల తీవ్ర క్షామం ఏర్పడింది. వర్షాలు కురవకపోవడంతో టైగ్రిస్ వంటి పెద్ద నది కూడా ఎండిపోయింది. దేశంలోనే అతిపెద్ద జలాశయం కూడా నీరు లేక ఎండిపోయింది. దాంతో జలాశయం అడుగుభాగం బహిర్గతం అయింది. ఇక్కడ జర్మనీ, కుర్దు పురావస్తు పరిశోధకులు తవ్వకాలు చేపట్టగా, కంచు యుగం నాటి నగరం ఆవిష్కృతమైంది.
ఈ పరిశోధనలో జర్మనీ ఫ్రీబర్గ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఇవానా పుల్జిజ్ పాల్గొన్నారు. ఈ నగరం టైగ్రిస్ నదిని ఆధారంగా చేసుకుని నిర్మితమైందని వివరించారు. ప్రస్తుతం ఈశాన్య సిరియా భూభాగంలో ఉన్న మిట్టానీ సామ్రాజ్యంతో ఈ భూభాగాన్ని అనుసంధానం చేసే ప్రధాన నగరం ఇదే అయ్యుంటుందని అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ జలాశయంలోకి మళ్లీ నీరు చేరితే, తవ్వకపు పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే ఇప్పటివరకు ఆవిష్కరించిన కట్టడాలకు ప్లాస్టిక్ తొడుగులతో బిగుతుగా కప్పివేస్తున్నామని జర్మనీ వర్సిటీ వెల్లడించింది. ఏదేమైనా, కంచు యుగం నాటి పరిస్థితులు, సంస్కృతిని మరింత తెలుసుకునేందుకు ఈ నగరం ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.