Mekapati Goutham Reddy: నామినేషన్ వేసిన విక్రమ్ రెడ్డి... లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామన్న కాకాణి
- గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక
- గౌతమ్ రెడ్డి వారసుడిగా ఆయన సోదరుడిని ఎంపిక చేసిన జగన్
- బాలినేని, కాకాణి వెంట రాగా విక్రమ్ రెడ్డి నామినేషన్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెంట రాగా విక్రమ్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తూ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
విక్రమ్ రెడ్డి నామినేషన్ అనంతరం కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమకు గెలుపునిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి గౌతమ్ రెడ్డి ఎంతో కృషి చేశారని, ఇప్పుడు ఆయన అడుగు జాడల్లోనే విక్రమ్ రెడ్డి నడుస్తున్నారని ఆయన తెలిపారు.