BJP: బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్!... గాంధీ నగర్‌లో వేడుకగా కార్యక్రమం!
- పటీదార్ ఉద్యమంతో మంచి గుర్తింపు దక్కించుకున్న హార్దిక్
- కాంగ్రెస్ పార్టీలో చేరినా సామర్థ్యం నిరూపించే ఛాన్స్ దక్కని వైనం
- ఇటీవలే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన యువ నేత
- నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తానని ప్రకటన
గుజరాత్ యువ రాజకీయ నాయకుడు, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ గురువారం మధ్యాహ్నం బీజేపీలో చేరిపోయారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన వేదిక మీద ఆయనను బీజేపీ నేతలు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ సీనియర్ నేతలు హార్దిక్‌ను పార్టీలోకి ఆహ్వానించేందుకు పోటీ పడ్డారు. అదే సమయంలో తన కంటే వయసులో చాలా పెద్దవారు తనను సాదరంగా ఆహ్వానిస్తున్న వైనంపై హార్దిక్ కూడా ఉద్వేగానికి గురయ్యారు.
పటీదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమం నేపథ్యంలో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిన హార్దిక్.. ఆ తర్వాత పలు కష్టాలను ఎదుర్కొన్నారు. రాష్ట్ర బహిష్కరణకు కూడా గురయ్యారు. కొన్ని రోజుల పాటు జైలు జీవితాన్నీ గడిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ చేరిపోయారు. పదవుల పరంగా కాంగ్రెస్‌లో హార్దిక్‌కు మంచి గుర్తింపే దక్కినా... సామర్థ్యం నిరూపించుకునే అవకాశమే ఆయనకు దక్కలేదు. ఇదే వాదనను వినిపించిన హార్దిక్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీలో చేరిన ఆయన తాను నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేస్తానని ప్రకటించారు.