Telangana: తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రంపై ఏదో రకంగా పోరాటం చేయాల్సి వస్తూనే ఉంది: కేసీఆర్

KCR fires on Center

  • తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రం వివక్ష చూపుతూనే ఉంది
  • ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టింది
  • మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు నిధులు ఇవ్వలేదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో సమైక్య పాలకులు వివక్ష చూపారని... రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే వివక్ష ప్రారంభమయందని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత వేడుకలు కూడా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టిందని అన్నారు. 

రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఐదేళ్ల పాటు హైకోర్టును విభజించకుండా తాత్సారం చేసిందని కేసీఆర్ విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు రూ. 24 వేల కోట్ల నిధులను ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు. కరోనా సమయంలో కూడా ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ పక్కన పెట్టేసిందని అన్నారు. 

ఐటీఐఆర్ పార్క్ కు కేంద్రం మంగళం పలికిందని కేసీఆర్ దుయ్యబట్టారు. దీన్ని అమలు చేసి ఉంటే ఐటీ రంగంలో తెలంగాణ మరింత పురోగమించేదని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభించేదని చెప్పారు. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహాన్ని కలిగించేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్రంపై ఏదో రకంగా పోరాటం చేయాల్సి వస్తూనే ఉందని... ఇకపై కూడా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News