K A Paul: 1200 మంది అమరుల కుటుంబాలను టీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు: కేఏ పాల్
- అమరులు జైల్లో ఉంటే కేసీఆర్ అందలం ఎక్కారన్న పాల్
- ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ ఫ్యామిలీ... చీకట్లో అమరుల కుటుంబాలంటూ విమర్శ
- ప్రజలకు కనీసం తినే తిండి కూడా లేకుండా చేశారన్న పాల్
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూ క్రైస్తవ మత బోధకుడు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం సాయంత్రం వరుస ట్వీట్లు సంధించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినాన్ని కేసీఆర్ కుటుంబం జరుపుకుంటూ ఉంటే... తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన అమరుల కుటుంబాలు చీకట్లో ఉంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులు అయితే వారి కుటుంబాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదంటూ పాల్ ఆరోపించారు.
ఐలయ్య ఆత్మ బలిదానమే కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో జరిగిన గొప్ప విషయమని పాల్ విమర్శించారు. రఘుమా రెడ్డి అనే వ్యక్తి మంగళవారం రాత్రి 12 గంటల దాకా తమ కార్యాలయంలోనే ఉండగా... తెల్లారేసరికి ఆయనను టీఆర్ఎస్ సర్కారు అరెస్ట్ చేసిందన్నారు.
తెలంగాణ కోసం ప్రాణం ఇచ్చిన వారు జైల్లో ఉంటే.. వారి శవాలపై రాజకీయాలు చేసిన వారు అందలం ఎక్కారని పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్, కేటీఆర్ లు లక్షల కోట్లు సంపాదించి ప్రజలకు కనీసం తినే తిండికూడా లేకుండా చేశారన్నారు. త్యాగాలు అమరులవైతే... భోగాలు మాత్రం కేసీఆర్ కుటుంబానివని ఆయన ధ్వజమెత్తారు. పరిస్థితులు ఇలాగే సాగితే.. తెలంగాణ సాధనలో అమరులైన వారి బాధ ఎప్పటికి తీరాలని పాల్ ప్రశ్నించారు.