Lakhimpur Kheri: లఖింపూర్ హింసాకాండ కేసు సాక్షి దిల్‌బాగ్ సింగ్‌పై కాల్పులు

Lakhimpur Kheri violence witness escapes attempt on life

  • రైతులపై దూసుకెళ్లిన కేంద్రమంత్రి కుమారుడి కారు
  • ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు సహా ఏడుగురి మృత్యువాత
  • ఈ కేసులో సాక్షిగా ఉన్న బీకేయూ నేత దిల్‌బాగ్ సింగ్
  • ఆయన వాహనంపై పలుమార్లు కాల్పులు

లఖింపూర్ ఖేరి హింసాకాండ కేసులో సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆఫీస్ బేరర్‌ దిల్‌బాగ్‌సింగ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు నేతృత్వం వహించిన బీకేయూ లఖింపూర్ ఖేరీ జిల్లా అధ్యక్షుడైన దిల్‌బాగ్ సింగ్ ప్రయాణిస్తున్న ఎస్‌యూవీపై నిన్న సాయంత్రం పొద్దుపోయాక గుర్తు తెలియని సాయుధులు కాల్పులు జరిపారు. 

కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో తనకు రక్షణగా ఉన్న పోలీసు గార్డు సెలవులో ఉన్నాడని, దీనిని ఆసరాగా చేసుకుని తన ఎస్‌యూవీపై నిందితులు కాల్పులకు తెగబడ్డారని సింగ్ పేర్కొన్నారు. తొలుత వాహనం టైర్లలో ఒకదాన్ని పంక్చర్ చేశారని, ఆపై వాహనంపైకి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. దుండగులు తన కారు అద్దాలను తెరిచేందుకు ప్రయత్నించారని అన్నారు. పలుమార్లు కాల్పులు జరిపిన తర్వాత నిందితులు పారిపోయినట్టు చెప్పారు. 

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారని, ఘటనా స్థలాన్ని సందర్శించారని తెలిపారు. తనపై దాడి విషయాన్ని బీకేయూ నేత రాకేష్ టికాయత్‌కు కూడా చెప్పినట్టు చెప్పారు. సింగ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని, ఎస్‌యూవీని, క్రైం సీన్‌ను పరిశీలించేందుకు ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఎస్‌పీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులను గుర్తించే పనిలో పడినట్టు చెప్పారు. సింగ్‌కు రక్షణగా ఉన్న గార్డు సెలవులో ఉన్నట్టు తమకు తెలియదని, తమ దృష్టికి వస్తే మరో గన్‌మ్యాన్‌ను పంపి ఉండేవారమని వివరించారు.

గతేడాది అక్టోబరు 3న జరిగిన లఖింపూర్‌ఖేరి హింస కేసులో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా (తేని) కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన తన కారుతో రైతులను తొక్కించుకు వెళ్లినట్టు ఆరోపణలున్నాయి. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నలుగురు రైతులు, కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఓ జర్నలిస్టు ఆయన కారుకిందపడి నలిగి మరణించారు. అనంతరం జరిగిన హింసలో మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్రాను అదే నెల 9న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయట ఉన్నారు.

More Telugu News