Hardhik Patel: బీజేపీలో చేరుతున్న హార్ధిక్ పటేల్.. ముహూర్తం ఖరారు!
- ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన హార్ధిక్ పటేల్
- జూన్ 2న బీజేపీలో చేరనున్న పటిదార్ నేత
- ఆయనతో పాటు బీజేపీలో చేరనున్న 15 వేల మంది అనుచరులు
గుజరాత్ పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన బీజేపీలో చేరబోతున్నారు. జూన్ 2న బీజేపీలో చేరనున్నారు. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో గాంధీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు 15 వేల మంది అనుచరులు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
28 ఏళ్ల హార్ధిక్ పటేల్ 2019లో కాంగ్రెస్ లో చేరారు. ఈ నెల 18న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. తాను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను అయినా తనకు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ కేవలం నిరసన రాజకీయాలకే పరిమితమయిందని అన్నారు.
ఢిల్లీ నుంచి వచ్చే పార్టీ పెద్దలకు చికెన్ శాండ్ విచ్ సమయానికి అందిందో లేదో చూసుకోవడమే గుజరాత్ కాంగ్రెస్ నేతలకు ముఖ్యమని హార్ధిక్ విమర్శించారు. రాష్ట్రంలో పెద్దపెద్ద సమస్యలు ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకులకు పట్టవని దుయ్యబట్టారు. సమస్యలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్ గా తీసుకోదని... అదే కాంగ్రెస్ లో ఉన్న అతి పెద్ద సమస్య అని అన్నారు. గుజరాత్ అన్నా, గుజరాతీలు అన్నా పట్టనట్టు కాంగ్రెస్ హైకమాండ్ మాట్లాడుతుందని... అలాంటప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఎలా ఉండగలమని ప్రశ్నించారు.