Mayan: మెక్సికోలో పురాతన మాయన్ నగరాన్ని కనుగొన్న శాస్త్రజ్ఞులు
- మెక్సికోలో తవ్వకాలు
- ఇండస్ట్రియల్ పార్క్ కింద ప్రాచీన నగరం
- అనేక భవంతులు, కట్టడాలు గుర్తింపు
- 4 వేల మంది నివసించి ఉండేవారన్న శాస్త్రజ్ఞులు
సింధు, హరప్పా నాగరికతల తరహాలోనే భూమండలంపై విలసిల్లిన గొప్ప నాగరికతల్లో మాయన్ నాగరికత ఒకటి. అప్పట్లోనే మాయన్లు గొప్ప నగరాలు నిర్మించి చరిత్రకెక్కారు. కాలగమనంలో ఆ నగరాలన్నీ భూమిపొరల్లో నిక్షిప్తమయ్యాయి. తాజాగా, పురావస్తు శాస్త్రజ్ఞులు అత్యంత ప్రాచీన మాయన్ నగరాన్ని కనుగొన్నారు. మెక్సికోలోని మెరిడా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ నగరం బయల్పడింది.
భవనాలు, పిరమిడ్లు, వివిధ ఆకృతుల్లో ఉన్న కట్టడాలను ఈ సందర్భంగా గుర్తించారు. ఈ నిర్మాణాలన్నీ మాయన్ల స్వాభావిక పూయిక్ శైలిలో ఉన్నాయి. ఈ ఆవిష్కరణ గురించి పురావస్తు శాస్త్రజ్ఞుల బృందంలోని కార్లోస్ పెరెజా స్పందిస్తూ, ఇక్కడ 4 వేల మంది నివసించి ఉండేవారని తెలిపారు. ఇది క్రీస్తు శకం 600-900 సంవత్సరాల కాలం నాటిదని భావిస్తున్నారు. ఇక్కడున్న కొన్ని భవంతుల్లో పూజారులు, రచయితలు, ఇతర కళాకారులు నివసించేవారని, చిన్న భవనాల్లో సాధారణ ప్రజలు నివసించే వారని వివరించారు.
అక్కడికి సమీపంలోనే శ్మశాన వాటికను కూడా గుర్తించారు. అంతేకాదు, మాయన్ల సముద్ర జీవనానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు కూడా వెలికితీశారు. వ్యవసాయం మాత్రమే కాకుండా, సముద్రంలో చేపల వేట కూడా సాగించి ఉంటారని తెలుసుకున్నారు.
కాగా, ఈ మాయన్ నగరం బయటపడిన చోట ప్రస్తుతం ఓ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మిస్తున్నారు. పట్టణీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో అనేక పురావస్తు చిహ్నాలు ధ్వంసమైపోతున్నాయని, అయితే, చెక్కుచెదరని రీతిలో ఉన్న ఈ స్థలం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పురావస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.