Peddireddi Ramachandra Reddy: దేశంలో ఈ ఘనత సాధించిన ఏకైక ముఖ్యమంత్రి జగనే: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Peddireddi Ramachandra Reddy praises Jagan
  • 96 శాతం హామీలను జగన్ నెరవేర్చారన్న మంత్రి 
  • కొన్ని ఛానళ్లు, పత్రికలు చంద్రబాబు కంటే ఎక్కువగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని వ్యాఖ్య  
  • తాము ప్రజలను నమ్ముకుని పని చేస్తున్నామన్న పెద్దిరెడ్డి 
పాదయాత్ర సందర్భంగా వచ్చిన వినతులను, ఇచ్చిన హామీలను వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచి.. వాటిలో దాదాపు 96 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు చేసిన ప్రభుత్వం తమదని చెప్పారు. దేశంలో ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. 

ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఛానల్స్ టీడీపీ అధినేత చంద్రబాబు కంటే ఎక్కువగా స్పందిస్తూ, ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో కూడా వీరంతా మరింత తీవ్రంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారని అన్నారు. తమకు ఛానల్స్, పత్రికలు ఉన్నా, లేకపోయినా... ప్రజలు తమ పక్షాన ఉన్నారని చెప్పారు. తమ మంత్రులు, శాసనసభ్యులు అందరూ ప్రజలను నమ్ముకుని పని చేస్తున్నారని అన్నారు. 

తాము చేపట్టిన 'గడప గడపకూ ప్రభుత్వం' కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోందని... తమ ఇంటి వద్దకు వస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులను ప్రజలు ఆప్యాయతతో ఆహ్వానిస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పారు. గత ఎన్నికల్లో తాము 151 స్థానాలను సాధించామని.. రాబోయే ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ స్థానాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

అనంతపురం జిల్లాలో బస్సు యాత్రకు అపూర్వమైన స్పందన వచ్చిందని చెప్పారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన విమర్శలను చేస్తే బాగుంటుందని అన్నారు. వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలోని తన నివాసం వద్ద పెద్దిరెడ్డి పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.
Peddireddi Ramachandra Reddy
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News