Virender Sehwag: ఈ కోహ్లీ వేరయ్యా: సెహ్వాగ్ విశ్లేషణ
- గతంలో చూసిన కోహ్లీ వేరు
- ఈ సీజన్ లో ఆడిన కోహ్లీ వేరన్న సెహ్వాగ్
- ఇన్నేసి తప్పులు కోహ్లీ తన కెరీర్ లోనే చేయలేదని వ్యాఖ్య
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ 14 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ లో చేసిన తప్పుల కంటే మించి ఎక్కువ తప్పిదాలను ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చేసినట్టు సెహ్వాగ్ చెప్పాడు. మనం సాధారణంగా చూసే కోహ్లీకి భిన్నమైన రూపాన్ని ప్రస్తుతం చూస్తున్నట్టు పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచుల్లో గత రెండున్నరేళ్లుగా ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. గతంలో మాదిరి అతడు బ్యాటింగ్ తో సత్తా చూపించలేకపోతున్నాడు. దీంతో ఇక రిటైర్మెంట్ తీసుకో, విరామం తీసుకో అంటూ విమర్శలు, సూచనలు వినిపిస్తుండడం గమనార్హం. 2022 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ కు అర్హత సాధించాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు జట్టు ఓటమి పాలై ఇంటి బాట పట్టడం తెలిసిందే.
ఈ సీజన్ లో ఆర్సీబీ మొత్తం 16 మ్యాచ్ లు అడగా, విరాట్ కోహ్లీ సాధించిన స్కోరు 341 పరుగులు. సగటున చూస్తే ఒక్కో మ్యాచ్ కు 21 పరుగులు. అతడు నమోదు చేసిన రెండు అర్ధ సెంచరీలే ఈ సీజన్ కు హైలైట్. ‘‘మనకు తెలిసిన విరాట్ కోహ్లీ కాదు ఇతడు. ఈ సీజన్ కోసం ఆడింది భిన్నమైన కోహ్లీ. ఈ సీజన్ లో అతడు చేసినన్ని తప్పులు కెరీర్ మొత్తంలో కూడా చేయలేదు’’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.