TDP Mahanadu: బాబు గారిని దెబ్బేసి గెలిపించాలమ్మా.. నేను ఎకరంన్నర పొలం పందెం కాశా.. : మహానాడులో వెంకాయమ్మ
- వైసీపీ నేతల దాడికి గురైన వెంకాయమ్మ
- మహానాడులో ఆమె ప్రసంగానికి క్లాప్స్
- రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచిన మహానుభావుడు చంద్రబాబు అన్న వెంకాయమ్మ
- ఇది రాజన్న రాజ్యం కాదు, రౌడీ రాజ్యం.. అంటూ వ్యాఖ్య
వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగా లేదని చెప్పిన కారణంగా ఆ పార్టీకి చెందిన మహిళా నేతల చేతిలో దాడికి గురైన వెంకాయమ్మ శుక్రవారం ఒంగోలు కేంద్రంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు వేడుకలకు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వెంకాయమ్మ మహానాడులో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ సర్కారుపై మరోమారు విరుచుకుపడ్డారు. వెంకాయమ్మ ప్రసంగానికి టీడీపీ శ్రేణులు హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వెంకాయమ్మ జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ పాలనా తీరుపై ఆమె మాట్లాడుతూ, "కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన నన్ను జగన్ ప్రభుత్వం ఎలాగుందని మీడియా వాళ్లు అడిగారు. జగన్ ప్రభుత్వం ముండమోసిన ప్రభుత్వం, కొజ్జా ప్రభుత్వమని చెప్పాను. సంక్షేమ పథకాలన్నారు ఏం పథకాలిస్తున్నారు? నవరత్నాలన్నారు. ఏం నవరత్నాలు ఇస్తున్నారు? రూ.3 వేల పెన్షన్ అన్నారు. మూడేళ్లకు రూ.250 మాత్రమే పెంచారు. మరి రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచిన మహానుభావుడు మన చంద్రబాబు. రూ.5లకు వేడి వేడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను తీసేశారు కదా. రైతులకు రుణాలు అన్నారు. ఆ రుణాలు ఏమీ ఇవ్వలేదు. చాలా మంది రైతులు సారా, మందు తాగి చనిపోతున్నారు. ఒక రైతు బాగుంటేనే కదా మనం బాగుండేది. అలాంటి రైతే చనిపోతే మనం ఏం తింటాం?" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక దిశ చట్టం, రాష్ట్రంలో శాంతిభద్రతలపైనా ఆమె మాట్లాడుతూ.. "దిశ చట్టం అన్నారు. ఏడుందండి దిశ చట్టం? కేసులు పెట్టేందుకు వెళితే.. వారు ఆలకించడం లేదు. పట్టించుకోవడం లేదు. మొన్న ఏదో రైల్వే స్టేషన్‌లో భార్యాభర్తలు ఉంటే.. భార్యను రేప్ చేసి భర్తను కొట్టారు. మరి అప్పుడుందా ఈ దిశ చట్టం? మరి గుంటూరులో టిఫిన్ తేవడానికి వెళ్లిన రమ్యను కత్తితో పొడిచి చంపారు.
ఆడవాళ్లు రోడ్డు మీద తిరగాలంటేనే భయపడుతున్నారు. రాజన్న రాజ్యం అన్నారు కదా. ఇది రాజన్న రాజ్యం కాదు రౌడీ రాజ్యం. అవసరమైతే జనాల కిడ్నీలు కూడా అమ్మి చంపేసే రాజ్యం ఇది. కాబట్టే మనందరం బాబుగారిని గెలిపించుకుందాం. బాబు గారిని, లోకేశ్ బాబు గారిని గెలిపించుకుందాం.. నేను ఎకరంన్నర పొలం పందెం కాశా. మీకు కూడా దమ్ముంటే.. బాబు గారిని గెలిపించండి. మళ్లీ అందరం ఆనందంగా ఉందాం" అని ఆమె పిలుపునిచ్చారు.