KTR: ఔషధాల తయారీ మరింత వేగవంతం!... జీనోమ్ వ్యాలీలో డీఎఫ్ఈ ఫార్మా సీ2ఎఫ్ కేంద్రం!
![dfe pharma announced its new Centre of Excellence in Genome Valley](https://imgd.ap7am.com/thumbnail/cr-20220527tn629095b8cb387.jpg)
- జ్యూరిచ్‌లో కేటీఆర్‌తో డీఎఫ్ఈ ఫార్మా డైరెక్టర్ భేటీ
- జీనోమ్ వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు అంగీకారం
- సీ2ఎఫ్ ప్రాతిపదికన ఏర్పాటు కానున్న డీఎఫ్ఈ ఫార్మా కేంద్రం
- ఔషధాల తయారీ దశల కాల పరిమితి తగ్గించనున్న కేంద్రం
హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ప్రపంచ ఫార్మా దిగ్గజం డీఎఫ్ఈ ఫార్మా తన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొని తిరుగు ప్రయాణమైన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో జ్యూరిచ్‌లో డీఎఫ్ఈ ఫార్మా డైరెక్టర్ శాండర్ వాన్ గెస్సెల్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం డీఎఫ్ఈ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని కేటీఆర్ ప్రకటించారు.
డీఎఫ్ఈ ఫార్మా ఏర్పాటు చేయనున్న కేంద్రం క్లోజర్ టూ ఫార్ములేటర్ (సీ2ఎఫ్) ప్రాతిపదికన పని చేయనుంది. ఔషధాల తయారీకి సంబంధించి కాన్సెప్ట్‌తో మొదలుపెట్టుకుంటే.. ఔషధం ఉత్పత్తి అయ్యేదాకా పలు దశలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దశలన్నీ పూర్తి అయ్యేందుకు ఆయా కంపెనీలకు చాలా సమయమే పడుతోంది. డీఎఫ్ఈ ఫార్మా ఏర్పాటు చేయనున్న సీ2ఎఫ్ కేంద్రంతో ఈ దశలకు పడుతున్న సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. వెరసి ఔషధాల తయారీని మరింత సులభతరం చేసేందుకు ఉపయోగపడే సీ2ఎఫ్ కేంద్రాన్ని డీఎఫ్ఈ ఫార్మా ఏర్పాటు చేయనుందన్న మాట.