G.Pulla Reddy Sweets: కోర్టుకు చేరిన పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబ వివాదం
- రాఘవరెడ్డి కుటుంబంపై ఇదివరకే పంజాగుట్ట పోలీసులకు ప్రజ్ఞారెడ్డి ఫిర్యాదు
- తాజాగా హైదరాబాద్ మొబైల్ కోర్టును ఆశ్రయించిన వైనం
- తనను వేధిస్తున్న తీరును తెలుపుతూ ఫొటోలను సమర్పించిన ప్రజ్ఞారెడ్డి
- రాఘవరెడ్డి, ఆయన భార్య, కుమారుడికి కోర్టు నోటీసులు
- ప్రజ్ఞారెడ్డికి భద్రత కల్పించాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశం
నేతి మిఠాయిల వ్యాపారంలో ప్రఖ్యాతి గాంచిన పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కుటుంబ వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. తనపై గృహ హింసకు పాల్పడుతున్నారంటూ పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని రాఘవరెడ్డి కుటుంబంపై ఆయన కోడలు ప్రజ్ఞారెడ్డి హైదరాబాద్ మొబైల్ కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు బాధితురాలికి భద్రత కల్పించాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.
తనను హింసిస్తున్నారంటూ ప్రజ్ఞారెడ్డి ఇదివరకే రాఘవరెడ్డి కుటుంబంపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా తనను ఇంటిలోనే నిర్బంధించారంటూ ప్రజ్ఞారెడ్డి కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఇంటిలో తనను ఎలాంటి హింసకు గురి చేస్తున్నారన్న వైనాన్ని తెలిపే ఫొటోలను కూడా ఆమె కోర్టుకు అందజేశారు. దీంతో రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య, కుమారుడికి కోర్టు నోటీసులు జారీ చేసింది.