YSRCP: దావోస్‌లో జగన్ ప్రసంగంపై ప్రశంసలు కురిపించిన వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ!
![ysrcp mp Parimal Nathwani praises ys jagan speech at devos summit](https://imgd.ap7am.com/thumbnail/cr-20220523tn628bb73ed4fdd.jpg)
- దావోస్‌లో ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్‌పై జగన్ ప్రసంగం
- జగన్ ప్రసంగాన్ని కీర్తిస్తూ పరిమళ్ నత్వానీ ట్వీట్
- ఏపీలో మారుమూల పల్లెలకూ ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నారని వెల్లడి
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రసంగంపై వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన పరిమళ్ నత్వానీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ట్విట్టర్ వేదికగా జగన్ ప్రసంగంతో కూడిన వీడియోను పోస్ట్ చేసిన నత్వానీ... ఆ ప్రసంగం బాగుందంటూ కామెంట్ చేశారు.
దావోస్ సదస్సులో భాగంగా సోమవారం ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్ అనే అంశం మీద జగన్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ చర్చలో భాగంగా పలువురు ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు ఓపిగ్గానే కాకుండా వివరంగానూ సమాధానాలు ఇచ్చిన జగన్... ఏపీలో ఆరోగ్య రంగాన్ని ఎలా పటిష్ఠం చేస్తున్నామన్న విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే.
జగన్ ప్రసంగాన్ని ఆకాశానికెత్తేసిన పరిమళ్ నత్వానీ... మారుమూల పల్లెలకు ఆరోగ్య సేవలను విస్తరించే దిశగా చర్యలు చేపడుతున్నామని జగన్ చెప్పారన్నారు. విలేజ్ క్లినిక్‌లను ఏ రీతిన అభివృద్ధి చేస్తున్న విషయాన్ని కూడా జగన్ వివరించారని ఆయన తెలిపారు. ఏపీ ఆరోగ్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలను మరింతగా బలోపేతం చేస్తున్నట్లుగా జగన్ చెప్పారని నత్వానీ పేర్కొన్నారు.