Arjun Singh: బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం... బీజేపీని వీడి తృణమూల్ లో చేరిన ఎంపీ అర్జున్ సింగ్

MP Arjun Singh quits BJP and joined TMC
  • బెంగాల్ బీజేపీపై అర్జున్ సింగ్ అసంతృప్తి
  • కేంద్రం తీరుతోనూ విసిగిపోయిన వైనం
  • కోల్ కతాలో టీఎంసీ తీర్థం పుచ్చుకున్న వైనం
  • అర్జున్ సింగ్ కు సాదర స్వాగతం పలికిన అభిషేక్ బెనర్జీ
పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ అర్జున్ సింగ్ బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ అర్జున్ సింగ్ ను తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

తన కార్యకలాపాలకు అడ్డుతగులుతోందంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కొంతకాలంగా అర్జున్ సింగ్ గుర్రుగా ఉన్నారు. తాజాగా జనపనార ధరపై కేంద్రం నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోవడం పట్ల అర్జున్ సింగ్ అసంతృప్తికి గురయ్యారు. గతకొన్నాళ్లుగా జనపనారకు మద్దతు ధర కోసం అర్జున్ సింగ్ పోరాడుతున్నారు. కేంద్రం నిర్ణయం ఆయనను నిరాశకు గురిచేసింది.

అర్జున్ సింగ్ బెంగాల్ లోని బారక్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అర్జున్ సింగ్ గతంలో తృణమూల్ పార్టీకి చెందినవాడే. అయితే, 2019లో టీఎంసీ దినేశ్ త్రివేదీకి టికెట్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన అర్జున్ సింగ్ బీజేపీలో చేరారు. ఆ ఎన్నికల్లో అర్జున్ సింగ్... త్రివేదీని ఓడించారు. 

కాగా, అర్జున్ సింగ్ తనయుడు పవన్ సింగ్ భాత్ పారా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పవన్ సింగ్ కూడా తండ్రి బాటలోనే టీఎంసీలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Arjun Singh
MP
BJP
TMC
West Bengal

More Telugu News