Ranga Reddy District: నా చావుకు నేనే కారణమంటూ ఉరివేసుకుని యువ ఇంజినీర్ ఆత్మహత్య
- రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఘటన
- మిషన్ భగీరథ పథకంలో ఏఈగా పనిచేస్తున్న శివకృష్ణ
- రెండు రోజుల క్రితం ఇంటికొచ్చి ఉరివేసుకుని ఆత్మహత్య
- పెళ్లి ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకున్నాడన్న తండ్రి
తన ఆత్మహత్యకు తానే కారణమంటూ ఓ యువ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గుర్రంగూడ బాపిరెడ్డి కాలనీకి చెందిన శివకృష్ణ (27) నారాయణఖేడ్‌లో మిషన్ భగీరథ పథకం ఏఈగా పనిచేస్తున్నాడు. అతడికి ఇటీవలే ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 13న నారాయణఖేడ్ నుంచి ఇంటికి వచ్చిన శివకృష్ణ నైలాన్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే, రెండు రోజుల తర్వాత శివకృష్ణకు తండ్రి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో పెద్ద కుమారుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అతడు గుర్రంగూడలోని తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడమని చెప్పాడు. సోమవారం రాత్రి అతడు ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు.
వారొచ్చి తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. గదిలో శివకృష్ణ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడి దుస్తుల్లో కనిపించిన సూసైడ్ నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని, తనకు తానే కారణమని పేర్కొన్నాడు. పెళ్లి ఇష్టం లేక అతడు ఈ పనికి పాల్పడినట్టు శివకృష్ణ తండ్రి పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.