Nadendla Manohar: కేంద్రం నిధులతో కలిపి ఒక్కో రైతుకు రూ.19,500 రావాలి... కానీ ఏపీ ప్రభుత్వం రూ.6 వేలు మిగుల్చుకుంటోంది: నాదెండ్ల

Nadendla Manohar criticizes AP Govt on farmers issue

  • రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
  • గణపవరంలో కార్యక్రమం
  • పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తిన వైనం
  • తీవ్రంగా స్పందించిన నాదెండ్ల
  • ముఖ్యమంత్రి సిగ్గుపడాలని వ్యాఖ్యలు
  • సీబీఐ దత్తపుత్రుడు అంటూ విమర్శలు

ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం అందించడం తెలిసిందే. అయితే, పవన్ పై సీఎం జగన్ నేడు విమర్శల జడివాన కురిపించిన నేపథ్యంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ కల్యాణ్ నుంచి సాయం అందుకున్నవారు కౌలు రైతులు కాదని చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. 

పవన్ కల్యాణ్ అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించారని, 200 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించారని నాదెండ్ల వెల్లడించారు. ఆ 200 మంది కౌలు రైతులు కాదని జగన్ చెప్పగలరా? వారికి సంబంధించిన వివరాలను పోలీసులు తమ రికార్డుల్లో ఏం రాశారో చూపిస్తే సీబీఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రైతులను మోసం చేయడంలో సీబీఐ దత్తపుత్రుడు జగన్ ను మించినవాళ్లు ఉండరని నాదెండ్ల విమర్శించారు. వాస్తవంగా వైసీపీ చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్రం ఇచ్చే నిధులు కలుపుకుంటే ఒక్కో రైతుకు రూ.19,500 రావాలని, కానీ రాష్ట్రంలో ఇస్తున్నది రూ.13,500 మాత్రమేనని వివరించారు. ఆ లెక్కన ఒక్కో రైతు మీద జగన్ ప్రభుత్వం రూ.6 వేలు మిగుల్చుకుంటోందని నాదెండ్ల ఆరోపించారు. రైతు బిడ్డనని చెప్పుకుంటున్న జగన్, రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సిగ్గుచేటని పేర్కొన్నారు. 

నేడు గణపవరంలో సీఎం హోదాలో సీబీఐ దత్తపుత్రుడు చేసిన ప్రసంగం పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్రపై అక్కసు వెళ్లగక్కడానికే సరిపోయిందని నాదెండ్ల విమర్శించారు. రైతులను కులాల వారీగా విభజించిన ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News