Manda Krishna Madiga: చంద్రబాబు వల్లే మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు: మంద కృష్ణ మాదిగ
![manda krishna madiga meets varla ramaiah](https://imgd.ap7am.com/thumbnail/cr-20220516tn62821f980afd1.jpg)
- వర్ల రామయ్యతో మంద కృష్ణ భేటీ
- మహానాడులో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేయాలని మంద కృష్ణ వినతి
- మాదిగలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించింది ఎన్టీఆర్‌నని వ్యాఖ్య
- వర్గీకరణపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉందన్న మంద కృష్ణ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో భేటీ అయ్యారు. విజయవాడలోని వర్ల రామయ్య నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎస్సీ వర్గీకరణ గురించి వారిద్దరి మధ్య చర్చ జరిగింది. త్వరలో జరగబోయే మహానాడులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించే దిశగా ఓ తీర్మానం చేయాలని ఈ సందర్భంగా మంద కృష్ణ కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పట్ల పూర్తి నిర్లక్ష్యంగా ఉందని ఆయన ఆరోపించారు.
భేటీలో భాగంగా మంద కృష్ణ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని తొలుత ఎన్టీఆర్ గుర్తిస్తే... దానికి కొనసాగింపుగా చంద్రబాబు చర్యలు చేపట్టారని ఆయన అన్నారు. చంద్రబాబు కారణంగానే మాదిగలకు వర్గీకరణ ఫలాలు అందాయన్నారు. ఈ కారణంగానే ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అందులో భాగంగానే మహానాడులో ఎస్సీ వర్గీకరణ అంశం పరిష్కారానికి తీర్మానం చేయాలని మంద కృష్ణ కోరారు.