ISRO: ‘గగన్ యాన్’లో కీలక ఘట్టం.. రాకెట్ బూస్టర్ పరీక్ష సక్సెస్.. ఇదిగో వీడియో

ISRO Successfully Test Gaganyaan Rocket Booster
  • నిశ్చలస్థితిలో ఉంచి మండించిన ఇస్రో
  • 135 క్షణాల పాటు బూస్టర్ పరీక్ష
  • 700 పరామితులను పరిశీలించిన శాస్త్రవేత్తలు
  • ఈ ఏడాది చివర్లో మానవ రహిత, వచ్చే ఏడాది మానవ సహిత గగన్ యాన్ ప్రయోగాలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన మరో కీలక ప్రయోగం గగన్ యాన్. ఈ ప్రయోగంతోనే భారత్ తొలిసారిగా మానవుడిని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఇస్రో నిన్న ఓ కీలక ప్రయోగం చేసింది. ఆ పరీక్షలో సక్సెస్ అయింది. 

గగన్ యాన్ ప్రయోగానికి వాడే రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్ 3లోని రాకెట్ బూస్టర్ హెచ్ఎస్ 200ను నిన్న ఉదయం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో పరీక్షించింది. ఆ ఘన ఇంధన బూస్టర్ ను నిశ్చల స్థితిలో ఉంచి 135 క్షణాల పాటు మండించింది. టెస్ట్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇస్రో ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. 

గగన్ యాన్ ప్రయోగంలో కీలకమైన రాకెట్ లోని ఫస్ట్ దశకు సంబంధించిన పరీక్షలో అత్యున్నత మైలురాయిని విజయవంతంగా దాటామని ఇస్రో ప్రకటించింది. మండినంతసేపూ బూస్టర్ చాలా బాగా పనిచేసిందని చెప్పింది. చంద్రయాన్ మిషన్ లో జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ట్రాక్ రికార్డ్ చూశాక.. గగన్ యాన్ కూ అదే రాకెట్ ను వాడేందుకు నిర్ణయించామని పేర్కొంది. 

మనుషులను అంతరిక్షంలోకి పంపే ప్రయోగం కాబట్టి.. రాకెట్ లో కొన్ని మార్పులను చేశామని తెలిపింది. రాకెట్ నిర్మాణం నుంచి భద్రత వరకూ అన్నింటిలోనూ కీలకమైన మార్పులు చేశామని వెల్లడించింది. అదనపు భద్రతా ప్రమాణాలను జోడించామని, మోటార్ కేస్ జాయింట్లు, అధునాతన ఇన్సులేషన్ (వైరింగ్), ఇగ్నిషన్ వ్యవస్థలను మెరుగుపరిచామని ఇస్రో వివరించింది. 

కాగా, బూస్టర్ నిశ్చల స్థితి పరీక్షలో 203 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించారు. 135 క్షణాల పాటు బూస్టర్ ను మండించారు. మొత్తంగా 700 పరామితులను పరిశీలించారు. అన్నీ సాధారణంగానే ఉన్నట్టు నిర్ధారించి పరీక్ష సక్సెస్ అయినట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు. గగన్ యాన్ మిషన్ ను ఈ ఏడాది చివర్లో చేయనున్నారు. తొలి ప్రయోగంలో భాగంగా రాకెట్ ను మాత్రమే పంపించనున్నారు. రెండో ప్రయోగంలో భాగంగా వచ్చే ఏడాది మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. 

ISRO
Gaganyan
GSLV
Rocket
Booster
Static Test

More Telugu News