Avanthi Srinivas: "గడప గడపకు"లో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు చుక్కలు చూపిన జనం
![bheemili people questions avanthi srinivas in gadapa gadapaku programme](https://imgd.ap7am.com/thumbnail/cr-20220513tn627e348dc92e9.jpg)
- భీమిలి నియోజకవర్గం, పెద్దిపాలెంలో ఘటన
- అవంతిపై ప్రశ్నల వర్షం కురిపించిన మహిళ
- సమాధానం చెప్పలేకపోయిన మాజీ మంత్రి
ఏపీలో అధికార పార్టీ వైసీపీ చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆ పార్టీ నేతలను జనం ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ తరహా పరిస్థితులు ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.
శుక్రవారం నాటి కార్యక్రమాల్లో భాగంగా మాజీ మంత్రి, విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)కు ఆయన సొంత నియోజకవర్గ ప్రజలు చుక్కలు చూపించారు. నియోజకవర్గ పరిధిలోని ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా అవంతి రాగా... గ్రామంలోని సమస్యలను ఏకరువు పెడుతూ జనం ఆయనను చుట్టుముట్టారు.
ఈ సందర్భంగా ఓ మహిళ అవంతి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో కార్యక్రమం పేరిట వస్తారు, వెళతారు.. మరి సమస్యలు పరిష్కరించేదెవరు? అంటూ ఆ మహిళ కాస్తంత గట్టిగానే మాజీ మంత్రి నిలదీసింది. మహిళ అడిగిన ప్రశ్నలకు అసలు ఏం చెప్పాలో తెలియక అవంతి... అలా స్థాణువులా చూస్తూ నిలుచుండిపోయారు.