TDP: మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్‌పై హ‌త్య కేసు కొట్టివేత‌

erra sejhar aquitted from murder case
  • సోద‌రుడి హ‌త్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర శేఖ‌ర్‌
  • ఏళ్ల త‌ర‌బ‌డి కొన‌సాగుతూ వ‌స్తున్న కేసు
  • శేఖ‌ర్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు
ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గా, జిల్లాలోని జ‌డ్చ‌ర్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మ‌రాటి చంద్ర‌శేఖర్ అలియాస్ ఎర్ర శేఖ‌ర్‌కు శుక్ర‌వారం భారీ ఊర‌ట ల‌భించింది. సుదీర్ఘ కాలం పాటు టీడీపీ నేత‌గా కొన‌సాగిన శేఖ‌ర్ 2019లో బీజేపీలో చేరిపోయారు. తాజాగా ఏళ్ల త‌ర‌బ‌డి కొన‌సాగుతూ వ‌స్తున్న ఓ హ‌త్య కేసులో ఆయ‌న‌ నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ మేర‌కు హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు శుక్ర‌వారం ఈ కేసులో కీల‌క తీర్పు చెప్పింది.

ఎర్ర శేఖ‌ర్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఆయ‌న సోద‌రుడు ఎర్ర జగన్మోహన్ 2013లో హత్యకు గురయ్యారు. దేవరకద్ర మండలం పెద్దచింతకంట గ్రామ సర్పంచ్ పదవికి ఎర్ర శేఖర్ సతీమణితో పాటు జగన్మోహన్ భార్య కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సోదరులిద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. అదే సమయంలో జగన్మోహన్ హత్యకు గురి కాగా... ఈ హత్య ఎర్ర శేఖర్ పనేనంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శేఖర్ సహా ఆయన సతీమణితో కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు అయ్యింది. 

ఈ కేసు విచారణ చేపట్టిన ప్రజా ప్రతినిధుల కోర్టు... ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేవని తేల్చేసింది. దీంతో శేఖర్ పై కేసును కొట్టివేసింది. శేఖర్ తో పాటు ఆయన సతీమణి,మిగిలిన ఏడుగురిపైనా కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. 
TDP
JMahabubnagar District
Jadcherla
Erra Sekhar
BJP

More Telugu News