Andhra Pradesh: ఇంటింటికీ వెళ్లిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి నిరసన

AP Mins and MPs Face Backlash By Public

  • గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన
  • రోడ్డు ఎప్పుడు వేస్తారంటూ మంత్రి గుమ్మనూరు జయరాం ఘెరావ్
  • ఉపాధి కూలీ రావడంలేదంటూ బుగ్గనను నిలదీసిన మహిళలు
  • సమస్యలు చెప్పినా పట్టించుకోలేదంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఆగ్రహం

గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తగిలాయి. ఇవాళ కర్నూలు జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాంను హత్తిబెళగల్ లో పలు అంశాలపై ప్రజలు ఘెరావ్ చేశారు. ఆలూరు–హత్తిబెళగల్ మెయిన్ రోడ్డు ఎప్పుడు వేస్తారంటూ ప్రశ్నించారు. తమకు అమ్మ ఒడి ఎందుకు ఇవ్వడం లేదంటూ కొందరు మహిళలు మంత్రిని నిలదీశారు. 

ఇటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూ నిరసన తప్పలేదు. రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీ పనులకు డబ్బులు రావడం లేదంటూ హెచ్. కొట్టాలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఎందుకు పడడం లేదని అధికారిని అడిగిన మంత్రి.. వారంలో డబ్బులు పడతాయని వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

హిందూపురంలో ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ పై ప్రజలు మండిపడ్డారు. సమస్యలు చెప్పినా పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని మొరపెట్టుకున్నా వినలేదని చెప్పారు. 

కర్నూలు జిల్లా పత్తికొండ పరిధిలోని మద్దికెరలో డ్రైనేజీ సమస్య ఉందంటూ ఎమ్మెల్యే శ్రీదేవికి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎన్నోరోజుల కిందటనో డ్రైనేజీ పాడైందని, అయినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News